నటి రేణు దేశాయ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే కాకుండా నటిగానూ అందరికీ సుపరిచితం. ఇద్దరు పిల్లలకు తల్లిగా కొనసాగుతూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తోంది. తాజాగా రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషించింది. ఇందులో సంఘ సంస్కర్త హేమలత లవణం క్యారెక్టర్ చేసింది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా రేణు దేశాయ్ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తోంది.
మహేష్ సినిమాలో అవకాశం వచ్చినా చేయలేదు- రేణు దేశాయ్
తాజాగా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం రావడంపై స్పందించారు. మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో తనకు అవకాశం వచ్చిందని ఆమె వెల్లడించారు. అయితే, కొన్ని కారణాలతో ఆ సినిమాను చేయలేకపోయానని చెప్పారు. ఆ కారణాలు ఏంటి అనేది చెప్పి కాంట్రవర్సీ చేయాలి అనుకోవడం లేదని రేణు దేశాయ్ తెలిపారు. “‘సర్కారు వారి పాట’ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. బ్యాంక్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం నన్ను అడిగారు. ఆ రోల్ నాకు నచ్చింది. ఆ సినిమాలో నటించాలి అనుకున్నాను. కానీ, కొన్ని కారణాలతో చేయలేకపోయాను. ఆ కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు చెప్పలేను. అనవసరంగా కాంట్రవర్సీకి దారితీసే అవకాశం ఉంది. నిజం చెప్పాలని ఉన్నా, ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండటమే మంచిది” అని రేణు దేశాయ్ వెల్లడించారు.
హేమలత పాత్ర చేయడం నా అదృష్టం- రేణు దేశాయ్
ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో హేమలత లవణం పాత్ర చేయడం నిజంగా తన అదృష్టం అని చెప్పారు రేణు దేశాయ్. ఆ రోజుల్లోనే హేమలత బుందేల్‌ఖండ్ కు వెళ్లి అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. జోగిని వ్యవస్థ , అంటరానితనానికి వ్యతిరేకంగా కొట్లాడారని వెల్లడించారు. హేమలత పాత్ర కచ్చితంగా యువతకు మంచి స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. ఇంత గొప్ప పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అన్నారు. హేమలత పాత్రను చేయడానికి ముందు ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. అందులో భాగంగానే ఆమె మేనకోడలు కీర్తిని కలిసి పలు విషయాలు తెలుసుకున్నట్లు వివరించారు. ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. చివరకు తను అనుకున్నట్లుగా నటించినట్లు రేణుదేశాయ్ తెలిపారు.
రేణు దేశాయ్ 2003లో వచ్చిన ‘జానీ’ సినిమా తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ‘టైగర్ నాగేశర్వరరావు’ సినిమాలో కనిపించింది. స్టువర్టుపురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా దర్శకుడు వంశీ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రను రేణు దేశాయ్ చేశారు.
Read Also: నేచురల్ స్టార్ మూవీలో ప్రియాంక ఫిక్స్! ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత మళ్లీ జోడీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial