విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శుక్రవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు మొదలయ్యాయి. దాదాపు 4 లక్షల మంది అమ్మవారి దర్శనానికి రావొచ్చనే అంచనాల నేపథ్యంలో అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. 


క్యూలైన్లు కిటకిట


ఇంద్రకీలాద్రిపై వినాయకుడి గుడి నుంచి కొండపై వరకూ క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో వీఎంసీ వద్ద కంపార్ట్ మెంటును పోలీసులు ఏర్పాటు చేశారు. భక్తుల తాకిడి నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భద్రతను సీపీ కాంతిరాణా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రోప్స్ సాయంతో భక్తులను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు.


పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం


మరోవైపు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు. సీఎం పర్యటన నిమిత్తం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతా చర్యలు పటిష్టం చేశారు.


తిరుమలలోనూ వైభవంగా బ్రహ్మోత్సవాలు


కలియుగ వైకుంఠం తిరుమలలోనూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆరో రోజు తిరుమల శ్రీవారు, హనుమంత వాహనంపై దర్శనమివ్వనున్నారు. అలాగే, రాత్రి గజ వాహనంలో దర్శనమిస్తారు. గురువారం గరుడోత్సవం సందర్భంగా శ్రీవారిని 2 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగ్గా, శ్రీవారి సర్వ దర్శనానికి 21 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీనివాసుని హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 66,757 మంది భక్తులు గురువారం వెంకటేశుని దర్శించుకోగా, 26,395 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 


మూలా నక్షత్రం - అక్షరాభ్యాసాలు


మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం విశాఖలోని శారదా పీఠంలో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. రాజస్యామల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. దేవాలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి.