తెలంగాణలో ఎలక్షన్ నోటిఫికేషన్‌ కంటే ముందే వలసల పర్వం షురూ అయింది. టికెట్ల కేటాయింపు ఖరారు వచ్చేసరికి ఇది మరింత పెరిగింది. చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన వారు, టికెట్ రాదని తెలిసిన వెంటనే కండువా మార్చేస్తున్నారు. కొందరు వెయిట్ చేస్తూనే ప్రత్యర్థి పార్టీల్లో కర్చీఫ్ వేస్తున్నారు. టికెట్​ కోసం గోడ దూకేందుకు వెనుకాడటం లేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జంపింగ్‌ జిలానీల సీజన్‌ ఊపందుకుంది. అసెంబ్లీ టికెట్‌ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఇతర పార్టీలతో అంతర్గతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఉన్న పార్టీలో టికెట్‌ వచ్చే ఛాన్స్ లేకపోతే ఇంకో పార్టీలో చేరిపోతున్నారు. 


మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. వనపర్తి నియోజకవర్గం నుంచి 1994, 2009లలో రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పని చేశారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. 2014లో టీడీపీ తరపున వనపర్తిలో పోటీ చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అధికార పార్టీలో చేరికపై రావులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ రమణలు ఇటీవల చర్చించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో రావుల చేరిక ఖరారైంది. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రావుల ఆసక్తి చూపుతున్నారు. 


జిట్టా బాలకృష్ణారెడ్డి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గతంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ టికెట్‌ దక్కకపోవడంతో పార్టీని వీడారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, టీడీపీ నేత ఎలిమినేటి ఉమామాధవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం యువ తెలంగాణ పార్టీ స్థాపించినా ఎక్కువ కాలం నడపలేకపోయారు. ఆ తర్వాత వైసీపీ, యువ తెలంగాణ పార్టీ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా, 2018 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో యువ తెలంగాణ అభ్యర్థిగా  పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఆయన, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై జిట్టా అసంతృప్తితో ఉన్నారు. బాలకృష్ణారెడ్డితో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో చర్చలు జరిపారు. సొంత గూటికి తిరిగిరావాలని కోరడంతో జిట్టా సానుకూులంగా స్పందించారు.