Balineni YSRCP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం వైఎస్ఆర్‌సీపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు దగ్గర బంధువు అయినప్పటికీ ఆయనకు పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయి. మూడు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో పోలీసుల తీరుని నిరశిస్తూ గన్‌మెన్‌లను బాలినేని శ్రీనివాస రెడ్డి సరెండర్ చేశారు. హైదరాబాద్ నుంచి పోలీసు ఎస్కార్ట్ వాహనం, గన్ మెన్‌లు లేకుండానే తాడేపల్లికి బాలినేని వచ్చారు. ధనుంజయ రెడ్డితో భేటీ అయ్యారు. తర్వాత సీఎం జగన్ను కలిశారో లేదో స్పష్టత లేదు కానీ.. తన విషయంలో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అవమానామాలపై అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి వైసీపీలో ప్రాధాన్యత తగ్గిందనే భావనలో బాలినేని ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వ అధికారుల వద్ద తన మాటకి విలువ లేకుండా పోయిందని సన్నిహితుల వద్ద బాలినేని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఒంగోలులో కలకలం రేపిన నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాల స్కాం
ఒంగోలులో ఇటీవల నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాల స్కాం వెలుగు చూసింది. ఇందులో నిందితులు బాలినేని అనుచరులన్న ప్రచారం జరిగింది. ఇదంతా బాలినేని కనుసన్నల్లో జరిగిందని చెప్పుకోవడం ప్రారంభించారు. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒంగోలులో జరిగిన భూ కబ్జాను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి క్షోభకు ఎప్పుడూ గురి కాలేదని తెలిపారు. తనకు తెలియకుండా భూ కబ్జా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జా దోషులను పట్టుకోవాలని,. తన అనుచరులు ఉన్నా చర్యలు తీసుకోవాలని ధనుంజయ్ రెడ్డికి తెలిపారు. ఈ కేసులో నిస్ఫాక్షికంగా వ్యవహరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించాలని ధనుంజయ్ రెడ్డిని ఎమ్మెల్యే బాలినేని కోరినట్లుగా తెలుస్తోంది.
కొంత కాలంగా బాలినేనికి తగ్గుతున్న ప్రాధాన్యం
బాలినేని.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆప్తుడు, దగ్గర బంధువు. అయితే ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పుతున్న మరో నేత వైవీ సుబ్బారెడ్డి కూడా బంధువే. పార్టీలో తగిన గౌరవం లేకపోవడం.. బాధను వెళ్లగక్కుతూ అల్టిమేటం జారీచేయడం.. ఇంతలోనే తాడేపల్లి నుండి పిలుపు రావడం కామన్ గా జరుగుతోంది. ఇటీవల బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాలినేనికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన బాలినేని.. 48 గంటల్లోగా తన అనుచరులను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డైరెక్ట్ గా జగన్ ను కలుస్తానని హెచ్చరిక లాంటి ప్రకటన చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు.
మాగుంట, బాలినేని ఓ వైపు వైవీ సుబ్బారెడ్డి మరో వైపు !
ఒంగోలు ఎంపీ మాగుంట, బాలినేని శ్రీనివాసులరెడ్డి ఇప్పుడు కలిసి రాజకీయాలు చేస్తున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి తన కొడుకుకు రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్నారు అనూహ్యంగా ఆయన జైలుకెళ్లారు. ఈ సమయంలో వైసీపీ నుంచి జగన్ రెడ్డి నుంచి కనీస సపోర్ట్ రాలేదన్న అసంతృప్తిలో ఉన్నారు. అయితే మాగుంట మాత్రం ఎప్పుడూ బయటపడలేదు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి టిక్కెట్ ఇస్తారో లేదో ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. అయితే బాలినేని మాత్రం… మాగుంట కొడుకే పోటీ చేస్తారని చేస్తున్నారు. తాను అసెంబ్లీకి మాగుంట పార్లమెంట్ కు పోటీ చేస్తారని ప్రకటిస్తున్నారు పార్టీలో తమకు ఎదురవుతున్న పరిస్థితులపై వారిద్దరూ రగిలిపోతున్నారు.
ఏ పార్టీలోకి వెళ్లలేని నిస్సహాయత
బాలినేని మరి ఏ పార్టీలోకి వెళ్లలేరు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జగన్ తొలి కేబినెట్ లో స్థానం దక్కినా, మలి క్యాబినెట్ లో పదవి పోయిన తరువాత వైసీపీలో బాలినేనికి ప్రాధాన్యత సంగతి అటుంచి కనీస గౌరవం కూడా లేకుండాపోయింది. పార్టీలో పరిస్థితి అలా ఉంటే.. కనీసం ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదు. ఆఖరికి పోలీసులు, ఎమ్మార్వోలు, ముఖ్య అధికారుల బదిలీల విషయంలో ఆయనకు కనీస సమాచారం ఉండటం లేదు. అందుకే ఆయన ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. పార్టీ మారలేని పరిస్థితి ఆయనది.