BRS Bform : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఒకే సారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే వారికి బీఫామ్స్ కూడా పంపిణీ చేశారు.్ మూడు రోజులుగా పంపిణీ జరుగుతోంది. అయితే అయితే ఇప్పటి వరకూ 105 మందికి మాత్రమే బీఫామ్స్ పంపిణీ చేసినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ పది మందికిపైగా బీఫామ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 15న 69 మందికి, ఆ మరుసటి రోజు 28 మందికి కేసీఆర్బీఫాంలు ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న వాటిలో ఇందులో ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించని నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలు కూడా ఉన్నాయి. వీరిలో కొంత మందికి మార్పు తప్పదన్న వాదన వినిపిస్తోంది.
ఆలంపూర్ అబ్రహం మార్పు ఖాయం
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వంపై గులాబీ బాస్ నిర్ణయం మార్చుకున్నారని చెబుతున్నారు. అభ్యర్థిగా అబ్రహం పేరు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ బీఫామ్ ఇవ్వలేదు. అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపే యోచనలో అధిష్టానం ఉంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నిశితంగా పరిశీలన చేసి మరో నేతను బరిలోకి దింపాలని రిపోర్టు ఇచ్చారని అంటున్నారు. స్థానిక నేత విజయుడి పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా స్వయంగా కేసీఆరే ప్రకటించబోతున్నారని తెలిసింది. దీంతో బీఫామ్‌లు దక్కని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. బీఫామ్ చేతికొచ్చేవరకూ తాను అభ్యర్థిని, పోటీచేస్తున్నాననే విషయం మరిచిపోవాలని తమ అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో నేతలు చెబుతున్న పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో నెలకొంది.
ఆలస్యమైనా తమకే టిక్కెట్ ఇస్తారని నేతల భావన
కేసీఆర్ అందరికీ ఒకే సారి కాకుండా విడతల వారీగా ఇస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించినా మూడు రోజుల పాటు బీఫాం ఇవ్వలేదు. గురువారం ప్రగతి భ వన్ లో కడియం శ్రీహరికి బీఫాం ఇచ్చారు. అక్కడ తానే అభ్యర్థిగా ఉంటానంటూ రాజయ్య చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి కొన్ని నియోజకవర్గాల్లో బీఫాం కేసీఆర్ ఇవ్వలేదంటున్నారు. అయితే ఖచ్చితంగా అభ్యర్థిని మారుస్తారు అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పడం లేదు . ఒక్క ఆలంపూర్ అబ్రహం పేరును మాత్రం మారుస్తారని అంటున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని.. కొంత మంది ఆశావహులు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కొత్తగా చేరే వారికి ఇతర పదవులు ఆఫర్ ఇస్తారు కానీ టిక్కెట్ ఇచ్చే చాన్సే లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
పెండింగ్ స్థానాలపై సుదీర్ఘ కసరత్తు
పెండింగ్ పెట్టిన నియోజకవర్గాల్లో నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలపై కేసీఆర్ ఇంకా నిర్ణయం తీుకోలేదు. గోషామహల్, నాంపల్లి..మజ్లిస్ చాయిస్ . నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి మజ్లిస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అక్కడ హిందూ అభ్యర్థిని.. మజ్లిస్ చాయిస్ మీదనే నిలబెట్టే అవకాశం ఉంది. గోషామహల్ బీఆర్ఎస్ తరపున ఎవర్ని నిలబెట్టినా పూర్తి బాధ్యత మజ్లిస్ తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్ పెట్టిన జనగామకు పల్లాను అభ్యర్థిగా ఖరారు చేసి బీఫాం కూడా ఇచ్చారు. ఇక నర్సాపూర్ ఒక్కటే పెండింగ్ లో ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తానే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా ఆమెకే ప్రకటిస్తారంటున్నారు. మదన్ రెడ్డిని బుజ్జగించేప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆయన తాను పోటీలో ఉంటానటున్నారు.