Bappi Lahiri Top10 Telugu Songs: బప్పీ లహరి సంగీతం వినని సినిమా ప్రేక్షకులు లేరని అంటే అతిశయోక్తి కాదేమో! ఈ తరం, ఆ తరం అనే వ్యత్యాసాలు అవసరం లేదు. ప్రేక్షకులు అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఆయన పాటలు వినే ఉంటారు. 'సింహాసనం'తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయమైన ఆయన (Bappi Lahiri Died)... తొలి సినిమాకు హిట్ సాంగ్స్ అందించారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల్లోనూ పలు హిట్ సాంగ్స్ ఉన్నాయి.


సంగీత దర్శకుడిగా బప్పీ లహరి (Bappi Lahiri) హిందీలో ఎక్కువ సినిమాలు చేశారు. తెలుగులో ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ... వాటిలో ఎప్పటికీ మరువలేని సాంగ్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, నట సింహ బాలకృష్ణ... ఆయన ఏ హీరో సినిమాకు సంగీతం / స్వరాలు అందించినా హిట్టే. తెలుగులో బప్పీ లహరి టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే.



  • తెలుగులో సంగీత దర్శకుడిగా బప్పీ లహరి తొలి సినిమా 'సింహాసనం'. అందులో అన్నీ పాటలు బావుంటాయి. అయితే... 'ఆకాశంలో ఒక తార' పాట ప్రత్యేకం అని చెప్పాలి. 'సీమ టపాకాయ్'లో ఈ పాటను అల్లరి నరేష్ రీమిక్స్ చేశారు.

  • తెలుగులో చిరంజీవి - బప్పీ లహరి కాంబినేషన్ సూపర్ హిట్. వాళ్ళిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా 'స్టేట్ రౌడీ'. అందులోని 'రాధా... రాధా... మదిలోన మన్మథ బాధ' సాంగ్ సూపర్ హిట్.

  • చిరంజీవి 'గ్యాంగ్ లీడర్'లో అన్నీ సాంగ్స్ హిట్టే. అది ఎవర్ గ్రీన్ ఆల్బమ్ అని చెప్పాలి. 'గ్యాంగ్... గ్యాంగ్... బాజావో బ్యాంగ్ బ్యాంగ్' అంటూ అప్పట్లో యువతను ఉర్రూతలు ఊగించిన పాటలు అవి. ఇప్పటికీ పబ్బుల్లో, క్లబ్బుల్లో వినిపిస్తూ ఉంటాయి. తెలుగు పరిశ్రమకు డిస్కోను అలవాటు చేసిన సంగీత దర్శకుల్లో బప్పీ లహరి పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి.

  • బప్పీ లహరి డిస్కో సాంగ్స్ మాత్రమే కాదు... ఎమోషనల్ సాంగ్స్ కూడా చేశారు. అందుకు ఉదాహరణ మోహన్ బాబు 'రౌడీ గారి పెళ్ళాం' సినిమాలో 'బోయవాని వేటకు గాయపడిన కోయిల' పాట.

  • నట సింహ నందమూరి బాలకృష్ణ 'రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌' సినిమా ఉంది కదా! అందులో 'అరే ఓ సాంబ...' సాంగును 'పటాస్' సినిమా కోసం కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేశారు. ఆ ఒరిజినల్ సాంగ్ సృష్టికర్త బప్పీ లహరినే. బాలయ్య బాబుకు ఆయన అందించిన హిట్ సాంగ్ అది.

  • చిరంజీవి 'రౌడీ అల్లుడు' సినిమాకు బప్పీ లహరి సంగీతం అందించారు. అందులో 'చిలుకా క్షేమమా...' సాంగ్ సూపర్ హిట్. అయితే... ఆ పాటకు సాలూరి వాసు రావు సంగీతం అందించారు. అందులో రెండు పాటలు ఆయనే చేశారు. కానీ, పేరు వేసుకోలేదు. మిగతా పాటలకు బప్పీ లహరి సంగీతం అందించారు. అందులో 'అమలాపురం బుల్లోడా...' పాట ఎంత హిట్ అంటే... అల్లు శిరీష్ ఆ పాటను 'కొత్త జంట'లో రీమిక్స్ చేశారు.

  • బాలకృష్ణతో బప్పీ లహరి చేసిన మరో సినిమా 'నిప్పు రవ్వ'. అందులో ఓ పాట రాజ్ కోటి చేసినా... మిగతా పాటలు బప్పీ లహరి చేశారు. నేపథ్య సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. ఆ సినిమా పాటల్లో 'గులేబకావలి కవళికతో...' సాంగ్ హిట్.

  • చిరంజీవితో బప్పీ లహరి చేసిన మరో సినిమా 'బిగ్ బాస్'. సినిమా ప్లాప్. కానీ, పాటలు హిట్టే. చిరంజీవి, రోజా మీద తెరకెక్కించిన 'మావ... మావ' సూపర్ హిట్.

  • మోహన్ బాబు, ఆయన తనయులు విష్ణు, మనోజ్ కలిసి నటించిన 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో 'చూశాలే... చూశాలే...' పాటకు బప్పీ లహరి సంగీతం అందించారు.

  • తెలుగులో బప్పీ లహరి చివరి సినిమా (గాయకుడిగా) 'డిస్కో రాజా'. అందులో రవితేజ, ఆయన పాడిన 'రమ్ పమ్ పమ్' హిట్.