నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం.. అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు దీనిపై చర్చ జరిగింది. అయితే, నందమూరి కుటుంబం నుంచి మాత్రం దీనిపై ఎలాంటి వార్తలు లేవు. అయితే, స్వయంగా బాలకృష్ణే.. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై మాట్లాడారు. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు.
సినీ రంగంలో ఎవరైనా ఒక్కరు సినిమాల్లో నిలదొక్కుకున్నా.. ఆ ఫ్యామిలీ నుంచి తర్వాత కూడా చాలా మంది వారసులు ఇండస్ట్రీలో అడుగుపెడుతూ ఉంటారు. అయితే టాలెంట్ ఉంటేనే వాళ్లను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి ఇలా వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నారు. తాజాగా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ వారసుడు మరెవరో కాదు నందమూరి నటసింహ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ. నిజానికి మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే దానిపై ఇప్పటి వరకు బాలయ్య నుంచి క్లారిటీ రాలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
అయితే నందమూరి ఫ్యాన్స్ ఇన్నేళ్ళ నిరీక్షణకు తెరదించారు బాలకృష్ణ. తనయుడు ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీలో కుమారుడి ఎంట్రీపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞను టాలీవుడ్ కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే తనయుడి ఎంట్రీ ఉంటుందా అన్న ప్రశ్నకు.. అంతా దైవ నిర్ణయం అంటూ నవ్వుతూ బదులిచ్చారు బాలయ్య.
ఇక మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పారు బాలకృష్ణ. అందుకోసం కథ కూడా సిద్ధంగా ఉందని, అధికారిక ప్రకటనే తరువాయి అని అన్నారు. ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడుదల అయిన అన్ని చోట్లా ఈ సినిమా హిట్ టాక్ ను సంపాదించుకొని భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా బాలయ్య, బోయపాటి కాంబో ఈ సినిమాతో హ్యాట్రిక్ ను సాధించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. బాలయ్యకు బ్లాక్ బస్టర్ అందించిన ఈ సినిమాను 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం విశేషం. ఈ ఈవెంట్ లో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పాల్గొని సందడి చేశారు.
బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లో బాలయ్య లుక్స్ అదిరిపోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన ‘జై బాలయ్య’ పాటతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ పాటకు ఎస్.థమన్ అందించిన మ్యూజిక్ కూడా అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఇక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందిస్తున్నారట మేకర్స్. వచ్చే ఏడాది సంక్రాంతికే సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.