బ్రూస్ లీ లెజెండరీ మార్షల్ ఆర్టిస్ట్. చాలా మంది యువకులు ఇప్పటికీ ఆయన సినిమాలను ఎంతో ఇష్టపడుతారు.  ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ది వే ఆఫ్ ది డ్రాగన్ లాంటి సినిమాలను చూసి మైమరిపోతారు. ఆయన కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు, అద్భుత దర్శకుడు కూడా. మార్షల్ ఆర్ట్స్ లో అద్వితీయ ప్రతిభావంతుడు. అంతకు మించిన తత్వవేత్త. బ్రూస్ లీ గురించి, ఆయన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ గురించి చెప్తే భారతం, రాస్తే రామాయణం అవుతుంది.


20శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్టు


బ్రూస్ లీ నవంబర్ 27, 1940లో  అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోలో జన్మించారు. హాంకాంగ్ లో పెరిగి కరాటే యోధుడిగా మారారు. లీ అసలు పేరు లీ జాన్ ఫాన్. 20వ శతాబ్దంలోనే ప్రఖ్యాతి చెందిన మార్షల్ ఆర్టిస్టుగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన తన సినిమాల్లో, తన ఆర్ట్ లో ఎక్కువగా చైనా సంప్రదాయాలను ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకునేవారు. చైనీయుల సంప్రదాయ ఆర్ట్ అయిన కుంగ్ ఫూను తన సినిమాల్లో ఎక్కువగా చూపించేవారు.అందుకే చైనీయులు ఆయనను ఎంతో అభిమానించేవారు.


వన్ ఇంచ్ పంచ్ కు ఆశ్చర్యపోయిన ప్రపంచం


మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్ లీ  సరికొత్త టెక్నిక్స్ ను ఉపయోగించే వారు. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని కిక్స్ ప్రయత్నించే వారు. ఆయన పరిచయం చేసిన వన్ ఇంచ్ పంచ్  ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషన్ కరాటే చాంపియన్ షిప్ లో ఆయన ఈ పంచ్ ను తొలిసారి ఉపయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రత్యర్థికి కేవలం ఒక ఇంచ్ దూరంలో చేతిని ఉంచి, రెప్పపాటు కాలంలో అత్యంత శక్తివంతమైన పంచ్ విసిరారు. ఒకే ఒక్క పంచ్ తో నేలకూల్చాడు. ఈ పంచ్ విసరడం ఎలా సాధ్యమైందో అక్కడున్న ఎవ్వరూ గుర్తించలేకపోయారు.  చాలా కాలం పాటు వన్ ఇంచ్ పంచ్ మీద పలువురు అధ్యయనాలు కొనసాగించారు. చివరకు టెక్నిక్ తో మాత్రమే ఇది సాధ్యం అవుతుందనే అంచనాకు వచ్చారు పరిశోధకులు. సహజంగా శరీరంలోని శక్తినంతా కూడగట్టుకుని చేతిని బలంగా విసిరితే తప్ప దెబ్బ శక్తివంతంగా  తగలదు. కానీ, లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్ తో ముక్కలు చేసేవారు. టార్గెట్ కు కేవలం ఇంచ్ దగ్గర నుంచి కొడితే అంత బలమైన దెబ్బ ఎలా తగులుతుందో తెలియక చాలా మంది ఆరితేరిన మార్షల్ ఆర్టిస్టులు సైతం ఆశ్చర్యపోయేవారు. ప్రస్తుతం వన్ ఇంచ్ పంచ్ అనేది అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, ఈ పంచ్ విసరడం అనేది అత్యంత ప్రావీణ్యం ఉన్న మార్షల్ ఆర్టిస్టులకు మాత్రమే సాధ్యం అవుతుంది. వన్ ఇంచ్ పంచ్ సుమారు 153 పౌండ్లు (69 కిలోలు) శక్తిని కలిగి ఉంటుంది.






వన్ ఇంచ్ పంచ్ వెనుకున్న సైన్స్


బ్రూస్ లీ మాస్టర్ మూవ్ వన్ ఇంచ్ పంచ్ గురించి తెలుసుకోవాలంటే కాస్త, ఫిజియాలజీ, న్యూరోసైన్స్ లోకి తొంగి చూడాల్సిందే. లీ వన్ ఇంచ్ పంచ్ కు మార్షల్ ఆర్ట్స్ లో పోటీ లేదని చెప్పుకోవచ్చు. ఈ పంచ్ తో కేవలం ఒక ఇంచ్ దూరం నుంచే  ప్రత్యర్థులను నేలకూల్చే అవకాశం ఉంటుంది. లీ ఈ టెక్నిక్ లో అత్యంత నేర్పును ప్రదర్శించేవారు. వన్ ఇంచ్ పంచ్ శక్తి వెనుక బయో మెకానిక్స్ చిన్న విషయం కానప్పటికీ, పంచ్ ప్రభావం మీద మెదడు తీవ్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కండరాల శక్తి కంటే, మనుసులో నుంచి వచ్చే శక్తి ఎక్కువ ప్రభావం చూపించేది. లీ పిడికిలి కేవలం మిల్లీ సెకన్ల వ్యవధిలో ఒక్క ఇంచు మాత్రమే ప్రయాణించినప్పటికీ, పంచ్ అనేది పూర్తి శరీర కదలిక మీద ఆధారపడేది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ బయోమెకానికల్ పరిశోధకురాలు జెస్సికా రోజ్ ప్రకారం, లీ పంచ్ మెరుపు వేగాన్ని కలిగి ఉంటుంది. ఇంత బలం రావడానికి తన కాళ్ల నుంచి శక్తి మొదలై మెదడు వరకు అన్ని శక్తులు ఒకే పాయింట్ మీదకు వచ్చేవి. అతడి కాళ్ళ ఆకస్మిక కుదుపుకు కొనసాగింపుగా లీ తుంటి విపరీతమైన వేగాన్ని పెంచేది. అది క్రమంగా భుజం నుంచి పిడికిలి వరకు చేరేది. అతడి మోచేయి వేగవంతమైన పంచ్ విసిరేలా పిడికిలికి సహకరిస్తుందని రోజ్ వెల్లడించింది. పంచ్ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, లీ దాదాపు అంతే వేగంతో వెంటనే వెనక్కి తీసుకునేవారు. వన్ ఇంచ్ పంచ్ వెనుక కండరాల సమన్వయంతో పాటు సమయం ముఖ్య కారకాలుగా ఉండేవని రోజ్ వెల్లడించారు. 


మార్షల్ ఆర్ట్స్ న్యూరోసైన్స్


2012లో ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని న్యూరో సైంటిస్ట్ అయిన ఎడ్ రాబర్ట్స్ వన్ ఇంచ్ పంచ్ మీద ఓ అధ్యయనం చేశారు. ఇందులో కరాటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్లు, మార్షల్ ఆర్ట్స్ సాధన చేయని వ్యక్తుల మధ్య పంచింగ్ బలాన్ని (2 అంగుళాల కంటే కొంచెం తక్కువ స్థాయిలో) పోల్చారు. "మేము కనుగొన్న మొదటి విషయం ఏమిటంటే, కరాటే నిపుణులు సాధారణ, శిక్షణ లేని వ్యక్తుల కంటే చాలా గట్టిగా పంచ్ ఇవ్వగలరు.  బ్రూస్ లీ వంటి నిపుణులు సంక్లిష్ట కదలికలో అత్యంత శక్తివంతమైన పంచ్ ఇవ్వగలని కనుగొన్నాడు. లీ కండరాల మాదిరిగానే, తన మెదడు శక్తిని చాలా సంవత్సరాల పాటు అత్యంత కఠినమైన అభ్యాసంతో కష్టపడి సంపాదించారని ఆయన తెలిపారు.


బ్రూస్ లీ ప్రత్యేకతలు


పీడ్ ఫైటింగ్ టెక్నిక్ లో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకు బ్రూస్ లీ కేవలం 32 ఏండ్లకే చనిపోయారు. ఈయన కెరీర్ లో ఎన్నో అద్భుత సంఘటనలున్నాయి. లీ ప్రైవేట్ గా కుంగ్ ఫూ క్లాసులు చెప్పడానికి గంటకు 275 డాలర్లు వసూలు చేసేవారట.  ఫైటింగ్ లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్ప పాటుకంటే ఎక్కువ వేగంతో కదిలేది. వన్ ఇంచ్ పంచ్ లో లీ అత్యంత నేర్పరి. ఐదు దశాబ్దాల కిందటే ఆయన ఈ వన్ ఇంచ్ పంచ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు.


కేవలం గంటలో అసమాన మార్షల్ ఆర్టిస్టు కన్నుమూత 


జూలై 20, 1973లో ఆయన చనిపోయారు. తను నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోలో డబ్బింగ్ చెప్తుండగా ఆయన అకస్మాత్తుగా పడిపోయారు. వెంటనే తనను హాంకాంగ్ లోని బాప్టిస్ట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. కేవలం గంట సమయంలోనే ఆయన చనిపోయారు. మెదడు ఉబ్బిపోవడం మూలంగానే తను చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. తాజాగా ఆయన మరణ రహస్యాన్ని సైతం పరిశోధకులు వెల్లడించారు. కిడ్నీలు అదనపు నీటిని బయటకు విసర్జించలేకపోవడం వల్ల, మెదడు ఉబ్బి చనిపోయినట్లు తెలిపారు. నీళ్లే తన మిత్రులు అని చెప్పే బ్రూస్ లీని ఆ నీళ్లే చంపేశాయని వెల్లడించారు. ఆయన నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా, తను చనిపోయాక విడుదల అయ్యింది. 


Read Also: నలభై తొమ్మిదేళ్ల తరువాత బ్రూస్ లీ మరణ మిస్టరీని చేధించిన పరిశోధకులు