నందమూరి బాలకృష్ణ(Balakrishna) అంటే చాలా మంది భయపడతారు. ఆయనతో కలిసి సినిమాలు చేసే టెక్నీషియన్స్, నటీనటులు కూడా బాలయ్యను చూసి జంకుతుంటారు. అయితే ఆయన్ను అర్ధం చేసుకున్నవారు మాత్రం బాలయ్యతో బాండింగ్ ను అసలు వదులుకోరు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ ఆ అనుబంధాన్ని ఆస్వాదిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. 


ఈ సినిమాలో చెల్లెలి సెంటిమెంట్ కి ప్రాధాన్యం ఉంది. బాలయ్య చెల్లెలిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది. బాలయ్య కలిసి నటించడం ఆమెకి ఇదే తొలిసారి. అయినప్పటికీ ఆయనతో మంచి బాండింగ్ పెంచుకుందట. కెమెరా ముందు క్యారెక్టర్ కి తగ్గట్లుగా 'అన్నా' అని పిలుస్తుంది. ఆఫ్ స్క్రీన్ మాత్రం 'డాడీ' అంటూ చిన్నపిల్లలా బాలయ్య చుట్టూ తిరుగుతుందట. బాలయ్య కూడా వరలక్ష్మిని కూతురిలా ట్రీట్ చేస్తున్నారట. 


షూటింగ్ పూర్తవ్వగానే.. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం, కలిసి భోజనం చేయడం వంటివి చేస్తున్నారట. వీరిద్దరి అనుబంధాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారట. వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. అయితే ఏ సినిమా సెట్స్ లో కూడా ఎవరితో కలుపుగోలుగా ఉండేది కాదట. ఇప్పుడు బాలయ్యను మాత్రం అసలు వదలడం లేదని అంటున్నారు. 


Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్


ఇక ఈ సినిమా విషయానికొస్తే.. దీనికి 'వీర సింహారెడ్డి' (Veera Simha Reddy) టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


మలయాళ భామ హానీ రోజ్ ఓ పాత్రలో కనిపించనుంది. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. 


తాజాగా మరో సినిమా ఓకే చేశారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి. సినిమా బడ్జెట్ కి తగ్గట్లే బాలయ్య భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి బాలయ్యకు రూ.25 కోట్లు పారితోషికంగా ఇస్తున్నారట. 


'అఖండ' సినిమాకి పది కోట్ల లోపే తీసుకున్న బాలయ్య.. గోపీచంద్ మలినేని సినిమా కోసం రూ.18 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకి తన రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. బాలయ్యకు పాతిక కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకొచ్చారని తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ పేచెక్ అని చెప్పాలి. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారట.