AR Rahman ‘Lal Salaam’ Song: తన మార్క్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడంలో ముందుంటారు దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇప్పటి వరకు ఎన్నో వందల పాటలకు తన సంగీతంతో ప్రాణం పోసిన ఆయన, ఇప్పుడు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.  తాజాగా ఆయన మ్యూజిక్ అందిస్తున్న ‘లాల్ సలాం’ సినిమాలో ఇద్దరు దివంగత గాయకులతో పాటలు పాడించబోతున్నారు. చనిపోయిన వ్యక్తులతో పాటలు పాడించడం ఏంటిన ఆశ్చర్యపోతున్నారా? నిజంగా నిజం. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో ఆయన ఇద్దరు దివంగత గాయకుల గొంతును వినిపించనున్నారు.


AI సాయంతో దివంగత గాయకుల వాయిస్ రీ క్రియేట్


ఇప్పటికే ‘లాల్ సలాం’ సినిమాకు సంబంధించి పాటల రికార్డింగ్ కంప్లీట్ చేసినట్లు రెహమాన్ వెల్లడించారు. దివంగత గాయకులు బాంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ వాయిస్‌ ను రీ క్రియేట్‌ చేసినట్లు తెలిపారు. వీరిద్దరి వాయిస్ తో ‘తిమిరి ఎలుదా..’ అనే పాటను రూపొందించినట్లు చెప్పారు. వారి వాయిస్ ను రీక్రియేట్ చేసేందుకు ఇద్దరు గాయకుల కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నట్లు రెహమాన్ తెలిపారు. వారి వాయిస్ ఉపయోగించుకున్నందుకు గాను తగిన రెమ్యునరేషన్ కూడా అందించినట్లు వెల్లడించారు. “దివంగత గాయకుల వాయిస్‌ అల్గారిథమ్స్‌‌ను వాడుకునేందుకు వారి కుటుంబసభ్యుల అనుమతి తీసుకున్నాం. ఇందుకోసం వారికి రెమ్యునరేషన్ కూడా అందించాం. అంతేకాదు, టెక్నాలజీని సరైన విధానంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు” అని ట్వీట్ చేశారు.


చిత్ర పరిశ్రమలో తొలి ప్రయోగం- సోనీ మ్యూజిక్


ఇక సినిమా పరిశ్రమలో ఇలాంటి ప్రయోగం తొలిసారి చూడబోతున్నట్లు సోనీ మ్యూజిక్ సంస్థ వెల్లడించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో దివంగత లెజెండ్స్ వాయిస్ కు మళ్లీ ప్రాణం పోసినట్లు తెలిపింది. బాంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ వాయిస్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నట్లు  తెలిపింది. గాయకుడు బాంబా బక్యా రెహమాన్‌తో చాలా పాటలు పాడారు. 2022లో ఆయన గుండెపోటుతో ఆయన చనిపోయారు. కాగా, షాహుల్ హమీద్ 1997లో చెన్నై సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. అటు ఈ నిర్ణయం పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగా, మరికొంత మంది విమర్శిస్తున్నారు.  






ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా రజనీకాంత్


‘లాల్‌ సలాం’ సినిమా.. క్రికెట్‌ చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్నిఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌కి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ముంబయి డాన్ మొయిద్దీన్ భాయ్‌గా రజినీ కాంత్ కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Also: రాజకీయాల్లోకి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, కొత్త పార్టీ పేరేంటో తెలుసా?