Anurag Thakur About TV Sets: టీవీ చూడాలంటే కచ్చితంగా సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేయాల్సిందే. ఫ్రీ చానెల్స్ చూడాలన్నా సెట్ టాప్ బాక్స్ తప్పనిసరి. కానీ, ఇకపై సెట్ టాప్ బాక్స్ లేకుండానే టీవీ చానెల్స్ చూసే అవకాశం కల్పించబోతోంది కేంద్ర ప్రభుత్వం. 200కి పైగా చానెల్స్ కు యాక్సెస్‌ను అందించడానికి టెలివిజన్ సెట్‌లలో ఇంటర్నల్ శాటిలైట్ ట్యూనర్లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ఏర్పాటుతో నేరుగా టీవీల్లోనే ఫ్రీ చానెల్స్ చూసే అవకాశం ఉంటుంటుందన్నారు. సెట్ టాప్ బాక్సులు లేకుండానే కార్యక్రమాలను వీక్షించవచ్చన్నారు. "మీ టెలివిజన్‌లో అంతర్నిర్మిత శాటిలైట్ ట్యూనర్ ఉంటే, ప్రత్యేక సెట్-టాప్ బాక్స్ అవసరం ఉండదు. ఒక క్లిక్‌తో 200 కంటే ఎక్కువ ఛానెల్‌లను యాక్సెస్ చేయవచ్చు” అని చెప్పారు.  


ఇకపై సెట్ టాప్ బాక్స్ లేకుండా ఫ్రీ చానెళ్లు చూసే అవకాశం


ఇంటర్నల్ శాటిలైట్ ట్యూనర్లతో కూడిన టెలివిజన్ సెట్లను కొనుగోలు చేస్తే, దానితో పాటు ఓ యాంటెన్నా వస్తుంది. దీనిని  ఇంటి పైకప్పు, లేదంటే గోడల మీద, లేదా అనుకూలంగా ఉన్న చిన్న స్థలంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఫ్రీ-టు-ఎయిర్ టెలివిజన్, రేడియో ఛానెల్స్ ప్రసారాలను పొందే  అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దూరదర్శన్ ఫ్రీ డిష్‌లో సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల విస్తరణ భారీగా జరిగినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కోట్లాది మంది వీక్షకులను ఆకర్షించడంలో సహాయపడిందన్నారు. దూరదర్శన్ అనలాగ్ ట్రాన్స్‌మిషన్‌ను దశలవారీగా నిలిపివేసే ప్రక్రియలో ఉందన్నారు. డిజిటల్ శాటిలైట్ ట్రాన్స్‌మిషన్‌ని ఉపయోగించి ఫ్రీ-టు-ఎయిర్ చానెళ్లు ప్రసారం చేయడం కొనసాగుతుందన్నారు. బిల్ట్  ఇన్ శాటిలైట్ ట్యూనర్ల కోసం బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ జారీ చేసిన ప్రమాణాలను పాటించేలా టెలివిజన్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేయాలని గత ఏడాది డిసెంబర్‌లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కు ఠాకూర్ లేఖ రాశారు.


ప్రస్తుతం టీవీ చానెల్స్ చూడాలంటే సెట్ టాప్ బాక్స్ తప్పనిసరి


ప్రస్తుతం, టెలివిజన్ వీక్షకులు పే, ఫ్రీ ఛానెల్‌లను చూడటానికి  సెట్-టాప్ బాక్స్‌ను కొనుగోలు చేయాలి. దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయబడిన ఫ్రీ-టు-ఎయిర్ ఛానెల్‌ల (ఎన్‌క్రిప్టెడ్ కాని) రిసెప్షన్ కోసం కూడా వీక్షకుడు సెట్-టాప్ బాక్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. 2015 నుంచి దూరదర్శన్ ఉచిత డిష్ కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య రెట్టింపు అయ్యింది. KPMG నివేదిక 2015లో ఫ్రీ డిష్ వినియోగదారులను 20 మిలియన్లు ఉన్నట్లు వెల్లడించింది. 2021లో ఈ సంఖ్య 43 మిలియన్లకు పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి విద్య అందుబాటులో ఉండేలా చూడడానికి ప్రధాని  మోదీ ఆదేశాలతో 1 నుంచి 12 తరగతులకు ప్రత్యేక చానెళ్లు ఏర్పాటు చేసినట్లు ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 విద్యకు సంబంధించిన చానెళ్లు ఉన్నట్లు వివరించారు.     


Read Also: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!