ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం గూగుల్. చేతిలో గూగుల్ ఉంటే చాలు, ప్రపంచ నలుమూల్లో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలుసుకోవచ్చు. ప్రపంచ దిగ్గజ సెర్చింజన్ గా గూగుల్ హవా కొనసాగిస్తోంది. కానీ, గత కొద్ది నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ అనే చాట్‌ బోట్‌ గూగుల్ కు చుక్కలు చూపిస్తోంది. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బోలెడన్నీ సెర్చ్ లింక్స్ ఇవ్వకుండా కట్టె.. కొట్టె.. తెచ్చె అనే మాదిరిగా సమాధానాలు అందిస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప‌ని చేసే చాట్ బోట్‌,  టెక్నాల‌జీ రంగంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం గూగుల్ కు గట్టి పోటీ ఇస్తోంది. గత కొద్ది కాలంగా యూజర్లు గూగుల్ కు బదులుగా చాట్ జీపీటీని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ అలర్ట్ అయ్యింది. డిసెంబ‌ర్‌తో ముగిసిన త్రైమాసికం ఆర్థిక ఫ‌లితాలను వెల్లడిస్తున్న సంద‌ర్భంగా,  ఆల్ఫా బెట్ ఈసీఓ సుంద‌ర్ పిచ్చాయ్, చాట్ జీపీటీ తరహా సేవల గురించి కీలక విషయాలు వెల్లడించారు.   


గూగుల్ నుంచి చాట్ జీపీటీ తరహా సేవలు


చాట్ జీపీటీపై  స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. త్వరలోనే గూగుల్ సైతం చాట్ జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పిన ఆయన, త్వరలో గూగుల్ యూజర్లకు బ్రౌజర్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను అందిస్తామన్నారు. త్వరలోనే ఈ సేవలు మొదలుకానున్నట్లు వెల్లడించారు. వచ్చే మే నెల వరకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వెల్లడించారు.  ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని చాట్ జీపీటీకి పోటీగా 20 ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులను గూగుల్ డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించారు.


చాట్ జీపీటీ కోసం సరికొత్త టూల్స్- సుందర్ పిచాయ్   


ఐపీఐ డెవ‌ల‌ప‌ర్ల కోసం సరికొత్త టూల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని సుందర్ పిచాయ్ తెలిపారు.  వాటితో  డెవ‌ల‌ప‌ర్లు సొంతంగా యాప్స్ రూపొందించుకునే అవకాశం ఉందన్నారు. మరోవైపు  చాట్ జీపీటీనీ మరింత అభివృద్ధి పరచడానికి చాట్ జీపీటీ మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐలో ప్రపంచ టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది.  ఈ నేపథ్యంలో  గూగుల్ సెర్చింజ‌న్‌ లోనూ చాట్ జీపీటీ త‌ర‌హా సేవ‌లు అందిస్తామని సుందర్ పిచాయ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా దిగ్గజ సెర్చింజన్ గూగుల్ కు చాట్ జీపీటీ భయం పుట్టించిందనే చెప్పుకోవచ్చు.






Read Also: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?