తెలుగు సినీ రంగంపై ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీసుకొని చర్యలను ఏపీ సర్కార్ తీసుకుంటుంది. తొలిసారిగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని ప్రకటించడంతో టాలీవుడ్ నిర్మాతలకు మింగుడు పడటం లేదు. ప్రభుత్వ విధానం ప్రకారం.. ఇకపై థియేటర్ యాజమాన్యం ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినప్పుడు రేట్లు పెంచుకుంటామంటే కుదరదు. దీనికి సంబంధించి విధి విధానాలను వైసీపీ ప్రభుత్వం ఖరారు చేసింది. సినిమాపై ప్రజలకున్న ఆసక్తిని ఎవరూ సొమ్ము చేసుకోలేని విధంగా, ప్రజలెవరూ ఆ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సినీ నిర్మాతలు, థియేటర్ల యజమానులతో సమావేశమైన ఆయన.. త్వరలోనే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమలులోకి తెస్తామని చెప్పారు. సినిమావాళ్ల కష్టాలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యల అనంతరం.. మరుసటిరోజే ఏపీ మంత్రితో సినీ ప్రముఖులతో భేటీ కావడం విశేషం.
బెనిఫిట్ 'షో' లు ఉండవా..?: పెద్ద సినిమాలు విడుదలైన తొలి రెండు రోజులు టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకుంటున్నారు నిర్మాతలు. అదే సమయంలో బెనిఫిట్ షో పేరుతో ముందస్తుగానే సినిమాని థియేటర్లలో ప్రదర్శిస్తూ టికెట్ రేట్లను ఐదారు రెట్లు ఎక్కువకి అమ్ముకుంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకుని అధికారికంగానే ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు. అయితే వైసీపీ హయాంలో బెనిఫిట్ షో వ్యవహారానికి బ్రేక్ పడింది. కరోనాకి ముందు కొన్ని పెద్ద సినిమాలకి కూడా టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఇప్పుడు కొత్తగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థని కూడా తెరపైకి తేవడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ ఇబ్బందిని నేరుగా బయటపెట్టకుండా, థియేటర్ల యాజమాన్యాలు ఇబ్బంది పడతాయి, వారిని ఆదుకోండి అంటూ నిర్మాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజా మీటింగ్‌లో బెనిఫిట్ షోల గురించి నిర్మాతలెవరూ తనని అడగలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేయడం విశేషం. ప్రభుత్వ విధానం వల్ల ప్రేక్షకులకే ఎక్కువ ప్రయోజనమని తెలుస్తుంది. టికెట్ల ధరలు అందుబాటులో ఉండట వల్ల ప్రేక్షకులు కూడా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తారనే అభిప్రాయం కూడా ఉంది.
Also Read: విశాల్ ఆ ఊపుడేంది? తెలుగు డబ్బింగ్‌పై ఫన్నీ వీడియో వదిలిన హీరో
నిర్మాతలు ఏమంటున్నారు?: మంత్రి పేర్నినానితో సమావేశం అనంతరం నిర్మాతలు మాత్రం సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై భిన్నంగా స్పందించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల దాదాపు 600 సినిమా థియేటర్లు ఇంకా తెరచుకోలేదని, కరెంటు చార్జీలలో రాయితీలు ఇవ్వడం, టికెట్ రేట్ల పెంపు వంటి నిర్ణయాలతో థియేటర్ల వ్యవస్థకు జీవం పోయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు సీనియర్ నిర్మాత ఆదిశేషగిరి రావు. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ గురించి తామే ప్రభుత్వాన్ని అడిగామని మరో నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. దీని వల్ల తెలుగు సినీ పరిశ్రమ సంతోషంగా ఉందని చెప్పారు. కొత్తగా విడుదలయ్యే సినిమాల బెనిఫిట్ షోల కోసం అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం తప్పకుండా అనుమతి ఇస్తుందని ఆయన చెప్పారు. అయితే ఇదే విషయంపై మంత్రి పేర్ని నాని స్పందన మరోలా ఉండటం విశేషం. ప్రజలందరూ స్వాగతించే నిర్ణయాలే తీసుకుంటామని చెబుతున్న మంత్రి, భవిష్యత్తులో బెనిఫిట్ షోలు ఉండవని పరోక్షంగా సంకేతాలిచ్చారు.
Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్, సామ్‌కు ఏమైంది?
Also Read: బిగ్ బాస్ ప్రోమో: నోరుజారిన ఫలితం.. ప్రియాను వెంటాడుతున్న లహరి, రవిల లేట్ నైట్ హగ్!