మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ ఏడాది జూలైలో ఉపాసన బేబీకి జన్మనివ్వబోతోంది. పెళ్లైన సుమారు పుష్కర కాలానికి చిరంజీవి ఫ్యామిలీలోకి మరో మెంబర్ రాబోతున్నారు. ఈ చిన్నారి కోసం చిరు కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతోంది ఉపాసన. ఆమెకు తోడుగా ఉంటున్నారు భర్త రామ్ చరణ్. తన కోసం సమయం కేటాయిస్తున్నారు. అంతేకాదు, కొంత కాలం పాటు సినిమాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


ఉపాసన బేబీ షవర్ పార్టీలో పాల్గొన్న బన్నీ


ఇక ప్రస్తుతం గర్భంతో ఉన్న ఉపాసనకు బేబీ షవర్ పార్టీలు జరుగుతున్నాయి. తాజాగా ఉపాసన ఫ్రెండ్స్ అంతా కలిసి దుబాయ్ లో బేబీ షవర్ పార్టీ నిర్వహించారు. మిత్రులు ఇచ్చిన సర్ ప్రైజ్ చూసి చెర్రీ దంపతులు ఆశ్చర్యపోయారు. అటు చిరంజీవి ఇంట్లో కూడా శ్రీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. రీసెంట్ గా మరోసారి ఆమెకు బేబీ షవర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది బంధు మిత్రులు పాల్గొన్నారు. విచిత్రం ఏంటంటే.. ఈ వేడుకలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం పాల్గొన్నారు. ఈ పార్టీలో తీసుకున్న ఫోటోలను బన్నీ స్వయంగా తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఉపాసనతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. “చాలా సంతోషంగా ఉంది డియర్ ఉప్సీ” అని వెల్లడించారు.


ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా?


వాస్తవానికి గత కొంత కాలంగా మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకూర్చేలా ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా కాలంగా కలుసుకోలేదు. గతంలో ఆయా పార్టీల్లో తరుచుగా కలిసేవారు. కానీ, గత కొంత కాలంగా వీళ్లు కలిసిన సందర్భాలు లేవు. తాజాగా బన్నీ ఈ వేడుకలో పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఇరు కుటుంబాల మధ్య ఏవో గొడవలు ఉన్నాయన్న వార్తలకు సైతం ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.


ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు జరిగాయి. సుకుమార్ కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అటు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.  






Read Also: ఎట్టకేలకు ‘జవాన్’లో అల్లు అర్జున్? పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు పూనకాలేనట!