బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలో మూడో భారీ బహిరంగ సభకు అంతా సిద్ధం అయింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నేడు సాయంత్రం జరిగే సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ సరిహద్దు నుంచి ఔరంగాబాద్‌కు 300 కిలో మీటర్ల దూరం. ఔరంగాబాద్ జబిందా మైదానంలో ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభ ఏర్పాట్ల కోసం కొన్ని వారాలుగా జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, తెలంగాణ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేణుగోపాలచారి, బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర కిసాన్‌ సమితి అధ్యక్షుడు మాణిక్‌రావు కదం, కాంధర్‌ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితరులు పర్యవేక్షించారు. 


కేసీఆర్ సభ ఉన్నందున ఔరంగాబాద్ పట్టణం అంతా గులాబీమయం అయ్యింది. ప్రధాన రహదారులకు గులాబీ తోరణాలు కట్టారు. భారీ హోర్డింగులు, కేసీఆర్ కటౌట్లను ఏర్పాటు చేయించారు. తెలంగాణలో లాంటి అభివృద్ధి దేశం మొత్తం అవసరం అనే భావనను కలిగించేలా ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.


మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖాతా తెరిచి సత్తా చాటాలని చూస్తోంది. ఇలా సన్నాహాక సమావేశాల్లోను బీఆర్ఎస్ నేతలు ఇదే కోణంలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, ఆసరా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించనున్నారు. ఈ కోణంలోనే బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు వివిధ పార్టీల నుంచి కింది స్థాయి నేతల చేరికలు బీఆర్ఎస్ లో భారీగా జరుగుతున్నాయి. 






నేడు ఏం మాట్లాడతారనేదానిపై ఆసక్తి


నేటి ఔరంగాబాద్ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన నాందేడ్, కాందహార్‌లో జరిగిన సభలో మహారాష్ట్ర రాజకీయాలతో పాటు  కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. అయితే నిన్న రాష్ట్రానికి అమిత్ షా వచ్చి కేసీఆర్ పైన విమర్శలు చేసిన వేళ, ఔరంగాబాద్ సభలో కేసీఆర్ అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.


ఔరంగాబాద్‌ జిల్లాలోని సిల్లోడ్‌, సియోగావ్‌, వైజాపూర్‌, గంగాపూర్‌, ఫైఠాన్‌, ఫులంబ్రి, కన్నాడ్‌ తదితర తాలుకాలతోపాటు, జల్నా, జల్‌గావ్‌ జిల్లాల్లోని తాలుకాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సభ గురించి ముమ్మర ప్రచారం చేశారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన మొదటి సభకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. మార్చి 26న చిన్న తాలుకా కేంద్రమైన లోహలో సభ నిర్వహించగా వేల మంది రైతులు, యువకులు తరలివచ్చారు.