బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ అభిమానులకు శుభ వార్త చెప్పారు. ఈ నెల 6న ఆలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దంపతులిద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. డెలివరీ తర్వాత కొన్ని రోజులు పాటు ఆసుపత్రిలో ఉన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో ఇటీవలే డిశ్చార్జి చేశారు వైద్యులు. రణ్‌బీర్, ఆలియా కుమార్తెను ఇంటికి తీసుకొస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.


చిన్నారి జన్మించిన తర్వాత... బిడ్డతో ఎక్కువ సమయం గడపడం కోసం రణ్‌బీర్ కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నట్టు గతంలో బాలీవుడ్‌ జనాలు గుసగుసలాడుకున్నారు. ఎక్కువ కాలం షూటింగ్‌లకు దూరం అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే... అందుకు భిన్నంగా కూతురు పుట్టిన కొద్ది రోజులకే షూటింగ్ స్పాట్ లో కనిపించారు రణ్‌బీర్.  ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. 


రణ్‌బీర్ చేస్తోన్న సినిమాల్లో 'యానిమల్' సినిమా ఒకటి. దీనికి 'అర్జున్ రెడ్డి' సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. 'అర్జున్ రెడ్డి' సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. దీంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేశారు. హిందీలో 'కబీర్ సింగ్'గా ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీశారు. అక్కడ కూడా సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత సందీప్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ, అది పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు రణ్‌బీర్ హీరోగా 'యనిమల్' మూవీను తీస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ సరసన రష్మిక మందన్న కనిపించనుంది.



అయితే, బాలీవుడ్ నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం 'యానిమల్' సినిమా షూటింగ్ షెడ్యూల్ ముంబైలోని ఓ స్టూడియో లో చిత్రీకరించనున్నారట. వీలైనంత త్వరగా ఈ షూటింగ్ పూర్తి చేసుకొని తర్వాత కూతురి కోసం దీర్ఘకాలిక విరామం తీసుకుంటారట రణ్‌బీర్. ఈ సినిమాతో పాటు పలు సినిమాల్లో కూడా కనిపించనున్నారు. 


Also Read : ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావ్ - ఇనాయకు గట్టిగా క్లాసు తీసుకున్న నాగార్జున


ఇక రణ్‌బీర్, ఆలియా జంటగా 'బ్రహ్మాస్త్ర'లో నటించారు. ఈ సినిమా బాలీవుడ్ లో భారీ విజయం సాధించింది. అసలు ఆలియా - రణ్‌బీర్ ప్రేమకు కారణం ఈ సినిమానే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ దగ్గరయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరు వివాహం చేసుకున్నారు. 


ప్రస్తుతం ఆలియా, రణ్‌బీర్ కూతురు పుట్టిన సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఓ వైపు రణ్‌బీర్ షూటింగ్ లు పూర్తి చేసే పనిలో ఉంటే మరోవైపు ఆలియా కూతుర్ని చూడటానికి వచ్చే వారికి కండిషన్స్ పెడుతోందట. తమ కుమార్తెను చూడటానికి వచ్చినవారు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తో రావాలని కోరిందట. దీంతో ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్ కారణంగా అందరూ ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసు. అందుకే ఆలియా ఇలా నిర్ణయం తీసుకుందట. అయితే ఇప్పటి వరకూ ఆలియా, రణ్‌బీర్ కుమార్తె ఫోటోను కూడా విడుదల చేయలేదు. మరి వీరి వారుసురాల్ని అభిమానులకు ఎప్పుడు పరిచయం చేస్తారో చూడాలి.