ఇటీవల విడుదలైన పలు బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ‘జవాన్’, ‘గదర్ 2’ చిత్రాలు కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఈ అద్భుత విజయాలు సినిమా పరిశ్రమకు మరింత బూస్టింగ్ ఇవ్వబోతున్నట్లు అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలు రూ. 1000 కోట్లకు పైగా వసూళు చేసి ఇండస్ట్రీకి మంచి ఊపును తెచ్చాయన్నారు. భవిష్యత్తులో బ్లాక్ బస్టర్ సినిమాల బెంచ్ మార్క్  రూ. 2000 నుంచి రూ. 3000 కోట్లుగా ఉండబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


బాలీవుడ్ కు కొత్త జోష్ తెచ్చిన మూడు చిత్రాలు


కరోనా మహమ్మారి కారణంగా బాలీవుడ్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది.  థియేటర్లు అన్ని మూతబడ్డాయి. తిరిగి సినిమా హాళ్లు ఓపెన్ అయిన తర్వాత కూడా ప్రేక్షకులు తాకిడి లేక నష్టాల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో అడపాదడపా వచ్చిన కొన్ని సినిమాలు మంచి ప్రేక్షకారణ పొందడంతో పాటు వసూళ్ల పరంగానూ సత్తా చాటాయి. రీసెంట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్','జవాన్' చిత్రాలతో పాటు సన్నీ డియోల్ మూవీ 'గదర్ 2' బాలీవుడ్ కు పునర్ వైభవం తీసుకొచ్చాయి. ఈ మూడు సినిమాలు అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాయి. వసూళ్ల పరంగానూ రికార్డుల మోత మోగించాయి.   


బ్లాక్ బస్టర్ బెంచ్ మార్క్ రూ. 2000- రూ.3000 కోట్లు- అక్షయ్


తాజాగా 'పఠాన్','జవాన్', 'గదర్ 2'  చిత్రాల విజయం పట్ల బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. "ఇండస్ట్రీ మరిన్ని హిట్స్ ఇస్తుందని ఆశిస్తున్నాను. షారుఖ్ ఖాన్ 'జవాన్' భారీ బిజినెస్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. 'గదర్ 2', 'ఓఎమ్‌జి 2' లాంటి చాలా సినిమాలు కూడా బాగానే ఆడాయి. ఈ సినిమా విజయాలు ఇండస్ట్రీకి చాలా మంచిది. ‘జవాన్’ మూవీ రూ. 1,000 కోట్ల బెంచ్‌ మార్క్‌ క్రియేట్ చేయడం గొప్ప విషయం. మున్ముందు రూ. 2000 నుంచి రూ. 3000 కోట్లు వసూళు చేసే సినిమాలు తీస్తామని అశిస్తున్నాను.  అప్పుడు హాలీవుడ్ సినిమాల మాదిరగా మనమే అద్భుత చిత్రాలను రూపొందించవచ్చు” అని అక్షయ్ తెలిపారు.


అక్షయ్ కెరీర్ లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా ‘మిషన్ రాణిగంజ్’


తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణిగంజ్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు కేవలం రూ. 2.8 కోట్లు వసూళు అందరినీ షాక్ కి గురి చేసింది. అక్షయ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. పెద్ద సినిమాలు పోటీలో లేకపోయినా కనీస వసూళ్లు సాధించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే  మైనింగ్ ఇంజనీర్ పాత్రలో అక్షయ్ కనిపించారు.  ‘స్పెషల్ 26’, ‘రుస్తుం’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన టీను సురేష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పరిణితి చోప్రా హీరోయిన్‌గా నటించింది. అటు ప్రస్తుతం అక్షయ్ కుమార్ 5 చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో ఓ మరాఠీ సినిమా కూడా ఉంది.


Read Also: ప్రాణం పెట్టి పని చేస్తున్నా- ప్రభాస్ మూవీపై మారుతి ఎమోషనల్ కామెంట్స్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial