అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కించిన 'లవ్ స్టోరీ' సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది చిత్రబృందం. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జున తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. 



 

ఆయన మాట్లాడుతూ.. ''ఇదొక హ్యుమానిటీ సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. మార్చి 2020 నుంచి ఈ కరోనాతో పోరాడుతూనే ఉన్నాం. ఒక వేవ్ వచ్చింది.. బయటపడ్డాం అనుకున్నాం.. తరువాత రెండో వేవ్ వచ్చి అణచివేసింది. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో కరోనా చావులు తగ్గాయి. ఏపీలో కూడా తగ్గుతున్నాయి. ఈ సక్సెస్ ను మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ కరోనాతో ఎంతో పోరాడాయి. వైఎస్ జగన్, కేసీఆర్ లు కరెక్ట్ డెసిషన్స్, కరెక్ట్ టైమ్ లో తీసుకున్నారు. ప్రభుత్వాలకు ప్రజలను సేఫ్ గార్డ్ చేయడమే వారికి ముఖ్యం. కొన్ని స్టేట్స్ లో థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. తెలంగాణలో వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకున్నాయి. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి అక్కడున్న పరిస్థితిని బట్టి'' అని చెప్పారు. 

 

ఆ తరువాత సినిమా గురించి మాట్లాడుతూ.. ''ఆ మధ్యన ఒక హిందీ సినిమా రిలీజయింది. కేవలం మూడు, నాలుగు కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. కానీ 'లవ్ స్టోరీ' సినిమాకి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల షేర్ వచ్చింది. మిగిలిన సినిమాలకు ఇదొక నాంది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో మరిన్ని సినిమాలు థియేటర్లోకి వస్తాయి. శేఖర్ కమ్ముల సెన్సిటివ్ డైరెక్టర్. తన సెన్సిటివ్ కథకు, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఎంతో బాగా తెరకెక్కించారు. సినిమాలో చిన్న చిన్న సన్నివేశాలు కూడా ఎంతో బాగున్నాయి. లవ్ స్టోరీ చూపించడానికి పెద్ద పెద్ద సెట్లు అవసరం లేదు.. ఒక టెర్రస్ చాలని చూపించారు శేఖర్. ఫన్ లవింగ్ లవ్ స్టోరీ లో నుంచి ఒక సీరియస్ టాపిక్ లోకి తీసుకెళ్లారు. నేను అసలు నమ్మలేకపోయాను. నువ్ చూపించిన విధానం ఎంత చక్కగా ఉందంటే.. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఒక మూడునాలుగు రోజులు ఎంత హెవీగా ఉందంటే.. 'ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా..? ఛీ' అని నువ్ కళ్లు తెరిపించావ్'' అంటూ ఎమోషనల్ అయ్యారు. 
 

అనంతరం ''నాన్నగారు నటించి 'ప్రేమ్ నగర్' సినిమా విడుదలై యాభై ఏళ్లు అవుతుంది. సరిగా యాభై ఏళ్ల తరువాత ఆ సినిమా విడుదలైన రోజునే 'లవ్ స్టోరీ' విడుదలైంది. అప్పుడు కూడా తుఫాన్, సైక్లోన్ అన్ని ఉన్నాయ్.. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తుఫాన్, కోవిడ్ తో పోరాడి 'లవ్ స్టోరీ' మరో 'ప్రేమ్ నగర్' అయింది'' అంటూ చెప్పుకొచ్చారు. చివర్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ.. ఎప్పుడూ మమ్మల్ని మంచిచూపుతో చూశారు.. ఇకపై కూడా మీ బ్లెస్సింగ్ మాకుండాలి అంటూ స్పీచ్ ముగించారు.