కోలీవుడ్‌లో అజీత్‌కు ఎంత మంచి పేరు ఉందో తెలిసిందే. వివాదాలకు దూరంగా, నిరాడంబరంగా, సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోయే మనస్తత్వం ఆయనది. అయితే, విజయ్ అభిమానులకు మాత్రం అజీత్ అంటే నచ్చదు. సోషల్ మీడియా వేదికగా ఆయన్ని తిట్టిపోస్తుంటారు. అది ఫ్యాన్ వార్ కాబట్టి.. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే, కోలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అజీత్ మీరు అనుకున్నంత జెంటిల్‌మ్యాన్ కాదని, తనని మోసం చేశాడంటూ ఆయన చేసిన కామెంట్స్.. అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.


అజిత్ నన్ను మోసం చేశాడు- నిర్మాత మాణిక్కం


తమిళ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, "అజిత్ తన తల్లిదండ్రులను సెలవులకు మలేషియాకు పంపాలని నా నుంచి డబ్బు తీసుకున్నాడు. సుమారు 16 ఏళ్ల క్రితం అజిత్ నా నుంచి రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా నా కోసం ఒక సినిమా చేస్తానని చెప్పాడు.  ఈ మొత్తాన్ని ఆ సినిమాలో సర్దుబాటు చేసుకోవచ్చు అన్నాడు. అయితే, ఇప్పటి వరకు  డబ్బు తిరిగి ఇవ్వలేదు. నాతో సినిమా చేయలేదు. సినిమా చేయమని అడిగితే డేట్స్ ఖాళీగా లేవని చెప్పారు. ఇప్పటి వరకు అసలుతో కలిపి ఆ మొత్తం రూ.1 కోటికి చేరుకుంది. అజిత్ జెంటిల్ మ్యాన్ కాదు, నన్ను మోసం చేశారు’’ అని తెలిపారు.


అంతేకాదు, అజిత్ భార్య  షాలినితో తనకు చాలా సంవత్సరాల నుంచి మంచి స్నేహం ఉందని, ఆమె చాలా మంచిదని నిర్మాత మాణిక్కం తెలిపారు. "అజిత్‌ది చాలా మంచి కుటుంబం. ప్రతి సినిమాకు రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొనే ఆయన ఇలా మోసం చేయడం ఎందుకు?” అని నారాయణ్ ప్రశ్నించారు. అంతేకాదు, AM రత్నం లాంటి ఫిల్మ్ మేకర్స్ అజిత్ చిత్రాలను నిర్మించడం ద్వారా చాలా డబ్బును పోగొట్టుకున్నారని తెలిపారు. ఆయనతో సినిమాలు తీసి రోడ్డున పడ్డవారికి అజిత్ ఏనాడు సాయం చేయలేదని చెప్పారు. తమిళ నిర్మాత అయిన మాణిక్కం నారాయణన్ కమల్ హాసన్ తో కలిసి ‘వేట్టైయడు విలయడు’, ‘ఇంద్రలోహతిల్ నా అళగప్పన్’ లాంటి చిత్రాలను నిర్మించారు. ఈ విషయంపై అజిత్ మేనేజర్ స్పందించారు. ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవం అని తేల్చి చెప్పారు. ఇలాంటి విషయాల గురించి తాము స్పందించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 


మగిజ్ తిరుమేనితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న అజిత్


అటు అజిత్ కుమార్, దర్శకుడు మగిజ్ తిరుమేనితో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాకు ‘విదా ముయార్చి’ అనే పేరు పెట్టారు. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది.  ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా నీరవ్ షా,  డిజైనర్ గా గోపీ ప్రసన్న వ్యవహరిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్‌ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.  ప్రస్తుతం అజిత్  స్విట్జర్లాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.   


Read Also: జూనియర్ దేవరకొండ ‘చాలా ఇంటెన్స్’- ఇంతకీ అనసూయ తిట్టిందా? పొగిడిందా?


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial