అనసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండ పంచాయితీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మొదలైన వీరి గొడవ తాజా మూవీ ‘ఖుషి’ వరకు కొనసాగింది. ‘ఖుషి’ సినిమా పోస్టర్ లో ది విజయ్ అని ఉండటంపై కూడా అనసూయ ఫైర్ అవుతూ ఓ పోస్ట్ చేసింది. దీని తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. వాస్తవానికి గత కొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే అనసూయ సోషల్ మీడియాలో విజయ్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తోంది. అనసూయపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ తతంగం కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా అనసూయ ఈ కోల్డ్ వార్ పై స్పందించింది. ఇకపై తాను ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని మనసులో మాట బయటకు చెప్పింది.
‘బేబీ’ మూవీపై అనసూయ ప్రశంసలు
అనసూయ గొడవలకు స్వస్తి పలుకుతున్నట్లు చెప్పిన నేపథ్యంలో, అనుకున్న మాటను నిలబెట్టుకుంది. అంతేకాదు, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చిత్రం ‘బేబీ’పై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ట్విట్టర్ లో సినిమా ట్రైలర్ ను షేర్ చేస్తూ అభినందించింది. “పార్టీకి చాలా ఆలస్యం అయింది. కానీ, ఇప్పుడు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. లవ్ యువర్స్ ట్రైలర్. ఈ ట్రైలర్ ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంది. నాకు తెలిసిన వాళ్ల కథ లాగే అనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఇంకా వేచి ఉండలేను” అంటూ రాసుకొచ్చింది. పనిలో పనిగా ఆనంద్ దేరకొండపైనా ప్రశంసలు కురిపించింది. విరాజ్ అశ్విన్ చాలా కూల్ గా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ చాలా ఇంటెన్స్ గా ఉన్నాడు. వైష్ణవి చైతన్య చాలా ప్రామిసింగ్ గా ఉందని వెళ్లింది.
అనసూయ ప్రశంసలపై నెటిజన్ల ఆశ్చర్యం
అటు ‘బేబీ’ మూవీపై అనసూయ చేసిన ట్వీట్ ఇండస్ట్రీ వర్గాల్లోనూ సంచనలం కలిగిస్తోంది. ఇది నిజంగా పొగడ్తనా? లేదా వ్యంగ్యమా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా అనసూయ అన్నమాట నిలబెట్టుకుందని మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అనసూయ-విజయ్ కు మధ్య వివాదం ఏంటి?
గతంలో విజయ్ దేవరకొండ సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే, ఆ సినిమా లో కొన్ని బోల్డ్ డైలాగ్ లను మ్యూట్ చేశారు. అయితే, సినిమా రిలీజ్ అయినప్పుడు విజయ్ ఓ థియేటర్ విజిట్ కు వెళ్లాడట. అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ సినిమాలో మ్యూట్ చేసిన బోల్డ్ డైలాగ్ లను అక్కడున్న యూత్ తో పలికించే ప్రయత్నం చేశాడు. ఆ విషయం పై అనసూయ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ తల్లిగా ఆ విషయం తనను బాధించిందని, అలా చేయొద్దు అని విజయ్ కు చెప్పింది. ఆ తర్వాత నుంచే తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కు దారి తీసింది. ఇక ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ మూవీ జులై 14న విడుదల కానుంది.
Read Also: ‘జవాన్‘ ట్రైలర్: ఏ హీరో నా ముందు నిలబడలేడంటూ గుండుతో షాకిచ్చిన షారుఖ్ ఖాన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial