Oscars 2023:
అకాడమీ అవార్డ్ విన్నర్ కీరవాణి..
తొలి సారి ప్రపంచమంతా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది RRR. అఫ్‌కోర్స్ ఇప్పుడు కొత్తగా ఈ సినిమా గురించి చెప్పుకునేది ఏమీ లేదు. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు కొల్లగొట్టి అందరూ కలలు గన్న ఆస్కార్‌నూ వశం (Oscar For RRR) చేసుకుంది. ఇప్పుడీ అవార్డు తెలుగు సినిమా బాధ్యతను పెంచేసిందనే చెప్పుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఆంధ్రా, నైజాం, సీడెడ్ అంటూ లెక్కలు వేసుకున్న తెలుగు సినిమా...ఇప్పుడు ఓవర్‌సీస్‌లోనూ మార్కెట్ పెంచుకునేందుకు రెడీ అయిపోతోంది. RRR ఈ అరుదైన ఫీట్ సాధించి "ఇది సాధ్యమే" అని నిరూపించింది. అయితే...ఇక్కడ స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది ఎమ్ ఎమ్ కీరవాణి గురించి. ఈ ఆస్కార్ అవార్డు తెలుగు సినిమా బాధ్యతనే కాదు...ప్రత్యేకంగా కీరవాణి బాధ్యతనూ పెంచేసింది. ఆస్కార్ అనేది చాలా గొప్ప బహుమతే అయినా..ఆ కీర్తిని భుజాలపై మోస్తూనే ఇప్పటి నుంచి సంగీత ప్రయాణాన్ని సాగించాలి. మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పినట్టు "ఇప్పటి వరకూ ఓ లెక్క. ఇక నుంచి మరో లెక్క". ఇప్పుడీ డైలాగ్‌ను కీరవాణికి కూడా ఆపాదించుకోవాలి. ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన కీరవాణి పేరు ఇకపై సిల్వర్ స్క్రీన్‌పై "Academy Award Winner MM Keeravani" అని మెరిసిపోతుంది. ఈ కిరీటం గొప్పదే అయినప్పటికీ..క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉండే వారికి ఇదే భారం కూడా. ఇకపై ఆయన చేసే ప్రతి సినిమానీ అందరూ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. "ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారట" కాస్త స్పెషల్‌గా మాట్లాడుకుంటారు. చెప్పాలంటే ఇకపై కీరవాణికి కెరీర్ అంతా లిట్మస్ టెస్ట్‌లా సాగడం ఖాయం.
రెహమాన్‌కు ఎంత ప్లస్ అయింది..?
నిజానికి బాహుబలికి ముందు కీరవాణి మ్యూజికల్ హిట్స్ తక్కువే. 2009లో వచ్చిన మగధీర, 2011లో వచ్చిన రాజన్న, ఆ తరవాత 2012లో వచ్చిన ఈగ సినిమాల మ్యూజిక్ అలరించింది. కానీ...ఇవన్నీ రాజమౌళి సినిమాలే. రాజన్నలోనూ రాజమౌళి ముద్ర ఎంతో కొంత కనిపించింది. ఒక్క రాజమౌళికి తప్ప మిగతా వాళ్లకు మామూలు పాటలే ఇస్తారు అన్న "ముద్ర" కీరవాణిపై పడిపోయింది. ఇకపై ఆ ముద్రనూ చెరిపేసుకోవాల్సి ఉంటుంది. "ఆస్కార్ వస్తే మన సినిమాల గురించి మాట్లాడుకుంటారు. సినిమాల్లోనూ గ్లోబలైజేషన్ ఖాయం" అనే స్టేట్‌మెంట్‌లు కరెక్టే కావచ్చు. అయితే...అంత మాత్రాన మన సంగీత దర్శకులు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు వరుస పెట్టి వస్తాయనీ అనుకోలేం. ఉదాహరణకు AR Rahman కెరీర్‌నే చూద్దాం. 2009లో ఏ ఆర్ రెహమాన్‌కు ఆస్కార్ వచ్చింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కారాయన. అప్పట్లో సోషల్ మీడియా పెద్దగా లేదు కాబట్టి దీని గురించి డిస్కషన్స్ ఎక్కువగా జరగలేదు. మన ఇండియన్ ఆస్కార్ కొట్టాడు అని జస్ట్ మాట్లాడుకున్నారంతే. అప్పట్లో ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వచ్చింది. హాలీవుడ్ ప్రాజెక్టులు రెహమాన్‌కు వరుస కడతాయని. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన నాలుగైదు ఇంగ్లీష్ సినిమాలకు మాత్రమే పని చేశారు. అవి కూడా పెద్దగా పాపులర్ కాలేదు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఒకవేళ అవకాశాలు వచ్చినా స్క్రిప్ట్ నచ్చకో, డేట్‌లు కుదరకో వదులుకున్నవీ ఉండొచ్చు. కానీ...ఆయన ఈ 14 ఏళ్లలో తమిళ్, హిందీ సినిమాలే ఎక్కువగా చేశారు. అయితే విదేశాల్లో వరుస కన్సర్ట్‌లతో బిజీ అయిపోయారు. ఈ విషయంలో మాత్రం ఆస్కార్ ఆయనకు హెల్ప్ అయిందని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అప్పటికే ఆయనకు ఎంతో కొంత విదేశాల్లోనూ ఫాలోయింగ్ వచ్చేసింది. Bombay Dreams ప్రాజెక్ట్‌తో అది కొంత వరకూ సాధ్యమైంది.
అసలైన ఛాలెంజ్..
ఆస్కార్ తరవాత రెహమాన్ అనే పేరు ఓ బ్రాండ్ ఇమేజ్ అయింది. కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఇస్తున్న పాటలు ఓ వర్గం వారిని మాత్రమే అలరిస్తున్నాయి. "రహమాన్ పని అయిపోయింది" అనే కామెంట్సే ఎక్కువగా వినబడుతున్నాయి. ఆస్కార్ విన్నర్ అని మార్కెటింగ్ చేసుకోడానికి పనికొస్తుంది తప్ప బలవంతంగా అయితే జనాల్లోకి పాటలు పంపించలేం. బాగుంటే వింటారు. లేదంటే లేదు. సో...ఇక్కడ ఆయన బ్రాండ్ ఇమేజ్ పెద్దగా హెల్ప్ చేయడం లేదనేది కాదనలేని వాస్తవం. ఏ మ్యూజిక్ లవర్ అయినా "ఆస్కార్ అవార్డ్ విన్నర్, మన ఇండియన్" అని నచ్చని పాటలైతే వినరు కదా. ఇప్పటికే రహమాన్ ఈ సవాల్‌ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడీ రేస్‌లో కీరవాణి చేరిపోయారు. ఇక రాజమౌళి-కీరవాణి కాంబో గురించి మాట్లాడుకుందాం. ఇదెంత సూపర్ హిట్టో స్పెషల్‌గా చెప్పే పనేముంది. RRRతో రాజమౌళి క్రేజ్ పదింతలు పెరిగిపోయింది. ఇకపై ఆయన చేసే ప్రాజెక్టులపైనా ప్రపంచం దృష్టి కచ్చితంగా ఉంటుంది. రాజమౌళి ప్రాజెక్ట్ (Rajamouli Next Projects) అంటే కచ్చితంగా పెద్దనే మ్యూజిక్ చేస్తాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో జక్నన్న నెక్స్ట్ సినిమా ఉండబోతుంది అంటూ గాసిప్స్ వినబడుతున్నాయి. అలాంటప్పుడు కీరవాణిపైనా కూడా బాధ్యత ఇంకా పెరుగుతుంది. "ఆస్కార్"అనే కీర్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ... ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడమే ఇప్పుడు ఆయనకు ఉన్న పెద్ద ఛాలెంజ్.
Also Read: Deepika Padukone: ‘నాటు నాటు’ గురించి భలే చెప్పావ్ దీపికా - చివర్లో ఏడిపించేశావ్‌గా!