"Do you know Naatu? Because if not, you're about to." (మీకు నాటు గురించి తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోబోతున్నారు). ఆమె పదాలను తెలుగులో అనువాదిస్తే అంత క్యాచీగా అనిపించకపోవచ్చు. కానీ, ఆమె ఆస్కార్ వేదికపై ‘‘నాటు నాటు’’ పాటను పరిచయం చేస్తూ కవితాత్మకంగా పలికిన పదాలు.. తప్పకుండా ఫిదా చేస్తాయి. బ్లాక్ గౌనులో బుట్టబొమ్మలా మెరిసిపోతూ.. చిరునవ్వులూ చిందిస్తూ.. ఎంతో చక్కగా ‘RRR’లోని ‘‘నాటు నాటు’’ పాటను పరిచయం చేసింది దీపికా. ఆమె మాట్లాడుతుంటే.. మధ్యలో కొందరు కేరింతలు కొట్టి ఎంకరేజ్ చేశారు. అయితే, దీపికా ఎక్కడా తొణకకుండా చాలా కాన్ఫిడెంట్‌గా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ కోసం తనదైన శైలిలో వివరించింది.
అంతేకాదు, ఆ తర్వాత కూడా దీపికా మరోసారి ఆకట్టుకుంది. అయితే, ఈ సారి ప్రజంటేషన్‌తో కాదు... కన్నీటితో. అదేంటీ? ఏమైంది? అని అనుకుంటున్నారా? అదేనండి.. ఆ వేదికపై భారతీయ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని ప్రకటించగానే.. ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. కీరవాణి, చంద్రబోస్ అవార్డులను చూపిస్తున్నంత సేపు దీపికా సంతోషంతో కన్నీళ్లు కారుస్తూనే ఉంది.
వాస్తవానికి మనం.. ‘ఆస్కార్’ అవార్డు అందుకొనే స్థాయి వరకు చేరిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ గురించే ఆలోచిస్తాం. వారి పడిన కష్టానికి ప్రతిఫలం లభించేప్పుడు కలిగే ఆనందాన్ని మనం అంచనా వేయగలం. అయితే, ఒక భారతీయ నటిగా, ప్రతినిధిగా.. తమ భారత చిత్రానికి ఆ అవార్డు లభించింది అంటే ఎంత గర్వంగా ఉంటుందనేది దీపికా కన్నీళ్లను చూసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె ‘‘నాటు నాటు’’ ప్రజంటేషన్ సందర్భంగా ఏం చెప్పిందో చూద్దాం.
‘‘అదరగొట్టే కోరస్, ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్.. కిల్లర్ డ్యాన్స్ మూవ్స్‌తో ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య స్నేహాన్ని చాటిచెబుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో వచ్చే పాట ఇది. ఈ పాటను తెలుగులో పాడటంతో పాటు వలసవాద వ్యతిరేక ఇతివృత్తాన్ని సజీవంగా ప్రదర్శించడంతో.. ఇది సంచలనం సృష్టించింది. యూట్యూబ్, టిక్‌టాక్‌లలో కోట్లాది వ్యూస్‌ను ఈ పాట సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థియేటర్లలో ప్రేక్షకులలో డ్యాన్స్ చేయించింది. అంతేకాదు, భారత చలన చిత్ర రంగం నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి పాటగా ఘనత సాధించింది. మీకు నాటు గురించి తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం నుంచి ‘‘నాటు నాటు’’ ఇదే..’’ అని దీపిక ఈ పాటను పరిచయం చేసింది. మొత్తానికి దీపికా ‘ఆస్కార్’ వేదికపై అందరినీ తన ప్రజంటేషన్‌తో మంత్రముగ్దులను చేసింది. ‘‘నాటు నాటు’’ పాటను ప్రజెంట్ చేయడానికి దీపికాను ఎంపిక చేయడంపై తెలుగు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మన ‘‘నాటు నాటు’’ గురించి మూడు ముక్కల్లో భలే చెప్పింది అంటూ ప్రశసింస్తున్నారు. మీరు ఒక వేళ దీపికా ప్రజెంటేషన్ మిస్సై ఉన్నట్లయితే.. ఈ కింది ట్వీట్‌ను చూడండి.
Also Read : ఆస్కార్ కొట్టినా బాలీవుడ్ సాంగ్ అంటారేంటి? తెలుగు వచ్చిందని జిమ్మీకి ఎవరైనా చెప్పండయ్యా