'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమా పరిశ్రమ అంతా మన తెలుగు చిత్రసీమ  వైపు చూసేలా చేసింది. ఒక్క పాటతో మన తెలుగు సినిమాను ప్రపంచ పటంలో నిలిపింది. 'నాటు నాటు' పాట (Naatu Naatu Won Oscar)కు ఆస్కార్ వచ్చింది. ఆ పాట రాసిన చంద్రబోస్, బాణీ అందించిన ఎంఎం కీరవాణి వేదిక మీదకు వెళ్లి అవార్డులు అందుకున్నారు. 


కార్తికేయకు కీరవాణి  థాంక్స్
వేదికపై ఆస్కార్ అందుకున్న తర్వాత అకాడమీకి కీరవాణి థాంక్స్ చెప్పారు. ఆ తర్వాత ''కార్పెంటర్స్ శబ్దాలు వింటూ నేను పెరిగాను. ఇప్పుడు ఆస్కార్స్ (Oscars 2023)తో ఉన్నాను. నా మనసులో ఒక్కటే కోరిక ఉంది. అలాగే... రాజమౌళి, మా కుటుంబ సభ్యుల మనసులో కూడా! 'ఆర్ఆర్ఆర్' గెలవాలి. ఎందుకంటే... ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన సినిమా. నన్ను శిఖరాగ్రాన నిలబెట్టాలి'' అని కీరవాణి తన మనసులో భావాలను పాట రూపంలో వ్యక్తం చేశారు. ఆ తర్వాత తమ్ముడు (రాజమౌళి) కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయకు థాంక్స్ చెప్పారు. అలాగే, వేరియన్స్ ఫిలిమ్స్ (Variance films)కి కూడా!


వాళ్ళిద్దరికీ ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
ఆస్కార్ వేదిక మీద తన పక్కన ఉన్న చంద్రబోస్ గురించి కానీ, 'నాటు నాటు...' పాడిన కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ గురించి గానీ కీరవాణి మాట్లాడలేదు. వాళ్ళ గురించి గోల్డెన్ గ్లోబ్ వేదికపై మాట్లాడారు. ఇప్పుడు ప్రత్యేకంగా వేరియన్స్ ఫిలిమ్స్, కార్తికేయకు థాంక్స్ చెప్పడానికి కారణం ఏమిటంటే? ఆస్కార్ ప్రయాణం వెనుక వాళ్ళిద్దరి కృషి కూడా ఉంది. 


Also Read : ఆస్కార్ తెచ్చిన రాజమౌళి - దర్శక ధీరుడికి చరిత్ర సలామ్ కొట్టాల్సిందే


ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో ఇండియా నుంచి అధికారికంగా 'ఆర్ఆర్ఆర్'ను జ్యూరీ పంపలేదు. దాంతో 'ఆర్ఆర్ఆర్' ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయని చాలా మంది భావించారు. ఇక దారులు మూసుకుపోయాయని చాలా మంది భావించారు. అప్పుడు కార్తికేయ రంగంలోకి దిగారు. వేరియన్స్ ఫిలిమ్స్ సహాయంతో ఆస్కార్ అవార్డులకు 'ఆర్ఆర్ఆర్' సినిమాను పంపడానికి కావాల్సిన అర్హతలను సాధించారు. అందుకని, వాళ్ళిద్దరికీ కీరవాణి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ ప్రయాణం గురించి 'ఏబీపీ దేశం'తో ప్రత్యేకంగా మాట్లాడిన 'బాహుబలి' చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ కూడా కార్తికేయ చేస్తున్న కృషి గురించి కొనియాడారు.


Also Read : ఆస్కార్ కొట్టినా బాలీవుడ్ సాంగ్ అంటారేంటి? తెలుగు పాటకు వచ్చిందని జిమ్మీకి ఎవరైనా చెప్పండయ్యా


'నాటు నాటు'కు స్టాండింగ్ ఒవేషన్
ఆస్కార్స్ స్టేజి మీద కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడటం ఒక ఎత్తు అయితే... వాళ్ళ పెర్ఫార్మన్స్ కంప్లీట్ అయ్యాక ఆడిటోరియంలో ఉన్న ప్రముఖులు అంతా నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. ఒక రెండు నిమిషాలు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తెలుగు పాటకు, భారతీయ పాటకు దక్కిన గౌరవంగా దీనిని మనం చూడాలి. రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)ను రాజమౌళి అభినందించారు.


ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య నిర్మించారు.