యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఆస్కార్‌ అవార్డుల వేడుక అత్యంత వైభవంగా సాగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండియన్‌ సినీ ప్రేమికులు ఆస్కార్‌ అవార్డు వేదిక వైపు మరింత ఆసక్తిగా చూస్తూ వచ్చారు. అందుకు కారణం ''నాటు నాటు..'' అనే విషయం తెల్సిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్‌ఆర్' సినిమాలోని ''నాటు నాటు'' పాట ఆస్కార్‌ ఎంట్రీని దక్కించుకున్న కారణంగా ఇండియన్ సినీ అభిమానులు ఇవాళ తెల్లవారు జామునుండే టీవీలకు అతుక్కుపోయారు. ఆస్కార్‌ వేదికపై ''నాటు నాటు'' పాట గురించి విన్న ప్రతిసారి కూడా ఆనందంతో గంతులేశారు. అలాంటి ఆనందాన్నే మెగాస్టార్ చిరంజీవి కూడా అనుభవించారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ''నాటు నాటు'' పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల ఒక సినిమా వ్యక్తిగా చాలా సంతోషంగా ఉందని.. ఆ చిత్ర యూనిట్ సభ్యుల్లో తమ కుటుంబ సభ్యుడైన రామ్ చరణ్‌ ఉండటం మరింత సంతోషాన్ని కలిగిస్తోందని చిరంజీవి అన్నారు.


‘‘నాటు నాటు’’ పాట ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్న కొద్ది నిమిషాలకే మెగాస్టార్ చిరంజీవి మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... ‘‘చాలా గొప్ప మూమెంట్‌ ఇది. ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే గూస్‌ బంప్స్ వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో నలబై ఏళ్లకు పైగా ఉన్న నాకు.. సినిమా వాళ్లకు ఎవరికైనా ఆస్కార్‌ అనేది అత్యుత్తమ పురస్కారం, అంతకు మించింది మనకేది ఉండదు. 'యుద్ద భూమి' సినిమా చేస్తున్న సమయంలో ఒకసారి ఆస్కార్‌ అవార్డు వేడుకకు ఆహ్వానం దక్కింది. అప్పుడు వెళ్లాము.. రెడ్‌ కార్పెట్‌ పై నడుచుకుంటూ వెళ్లి కూర్చున్నాం. ఆ సమయంలో ఆస్కార్ వేడుకను చూడటమే గొప్ప గర్వంగా ఫీలయ్యాను. అలాంటిది మనవాళ్లు, మన తెలుగు వాళ్లు, అందులో పార్ట్‌ అయిన చరణ్ నా ఇంటి బిడ్డ ఈ రోజు అక్కడ కూర్చుని ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక అవార్డు గెలుచుకుని వచ్చారంటే దానికి కారణాలు అనేకం, అనేక మంది గొప్ప టాలెంట్‌. మనం అందరం గర్వపడే గొప్ప మూమెంట్‌ ఇది. ఈ పాటకు ఆస్కార్‌ అవార్డు నామినేషన్స్ దక్కడం కాకుండా ఏకంగా అవార్డు రావడం అనేది నిజంగా గొప్ప విషయం. ఆస్కార్‌ అవార్డు వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో చరణ్‌, ఉపాసన ఫోన్ చేసి ఆశీర్వాదం అడిగారు. తప్పకుండా అవార్డ్‌ వస్తుందని వారితో నేను అన్నాను. ఆస్కార్‌ వేడుకల్లో అవార్డు దక్కించుకున్న ఇండియన్ షార్ట్‌ ఫిల్మ్‌ మేకర్స్ కి శుభాకాంక్షలు'’’ అన్నారు. ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఎంతో మంది ''నాటు నాటు''కు కూడా ఆస్కార్‌ అవార్డ్‌ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకు వెళ్లిన 'ఆర్ఆర్‌ఆర్' టీమ్‌‌ను ఎంత అభినందించినా తక్కువే అనే అభిప్రాయ పడుతున్నారు.






Also Read ఎన్టీఆర్ షేర్వాణీపై పులి బొమ్మ వెనుక సీక్రెట్ - 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌పై కామెంట్