26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల  నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
 
ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో కొన్ని చోట్ల సినిమా ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఆ విధంగా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. అయినప్పటికీ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. సినిమా అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని 'మేజర్' టీమ్ ప్రకటించింది. 


రూ.150 నుంచి రూ.175 లకు రేట్లను ఫిక్స్ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కానీ ఓ నెటిజన్ సంధ్య థియేటర్లో టికెట్స్ బుక్ చేస్తుండగా.. ఎక్కువ రేట్లు కనిపించాయి. దీంతో అతడు అడివి శేష్ ను ట్యాగ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. 'టికెట్ రేట్లు తగ్గించామని చెప్పారు కదా? ఇదేంటి బ్రో' అని ట్వీట్ వేశాడు. 

 

ఇది చూసిన అడివి శేష్.. రెండు గంటల్లో ఈ సమస్యను పరిష్కరించారు. 'సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేశాం.. రూ.150 టికెట్లు అమ్మేందుకు వారు ఒప్పుకున్నారు. ఇలా ఒప్పుకున్నందుకు థాంక్స్ అంటూ' సదరు థియేటర్ గురించి మాట్లాడారు అడివి శేష్.