Nizamabad News : చేపల వేట సరదా ఇద్దరు బాలికలను బలిగొంది. నీటిలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల పరిధిలోని కొలిప్యాక్ గ్రామంలో చోటుచేసుకుంది. కొలిప్యాక్ గ్రామ శివారులోని చెక్ డ్యామ్ లో చేపలు పట్టేందుకు కృష్ణవేణి, మౌనిక, శిరీష అనే ముగ్గురు బాలికలు కలిసి వెళ్లారు. శిరీష ఒడ్డు పైనే కూర్చుని ఉండగా, మౌనిక, కృష్ణవేణి చేపల కోసమని నీటిలో దిగారు. నీటి లోతును గమనించని మౌనిక, కృష్ణ వేణి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. మౌనిక (14) ఏడో తరగతి చదువుతుంది. తండ్రి గంగాధర్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కృష్ణవేణి (13) కూడా 7వ తరగతి చదువుతుంది. తండ్రి గంగారాం కూలి పనిచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అప్పటి వరకూ కళ్ల ముందే
చనిపోయిన బాలికలిద్దరూ స్నేహితులు. చేపల వేట సరదా కోసం వెళ్లిన బాలికలు ఇలా మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణ వేణి, మౌనిక నీళ్లలో మునిగిపోవటాన్ని గమనించిన శిరీష అరుస్తూ పరుగులు తీసింది. చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో పరుగులు తీస్తూ గ్రామంలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులకు చెప్పడంతో చెక్ డ్యాం వద్దకు వచ్చి గాలించారు. అప్పటికే బాలికలిద్దరూ చనిపోయారు. ఈతగాళ్లతో బాలికల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితురాళ్లు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అప్పటి వరకు కళ్ల ముందే ఉన్న తమ పిల్లలు ఒక్కసారిగా విగత జీవులుగా పడిఉండడంపై ఆ బాలికల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
విహార యాత్రలో విషాదం
ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు స్పీడ్ బోటు ప్రమాదంలో మృతి చెందాడు. కరీంనగర్‌లోని సుభాష్ నగర్ చెందిన పాతికేళ్ల కంటె యశ్వంత్ కుమార్.. గత డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అమెరికాలోని పోలిడలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. వారాంతపు సెలవులు కావడంతో మిత్రులతో కలిసి ఆదివారం ఫ్లోరిడా సమీపంలోని ఓ ద్వీపానికి వెళ్లాడు. అక్కడ స్పీడ్ బోటులో విహారయాత్ర చేశారు. విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో యువకులు స్వయంగా నడుపుతున్న బోటు ఆగిపోయింది. అప్పుడు ఆ బోటులో యశ్వంత్‌తోపాటు మరో యువకుడు ఉన్నాడు. బోటు ఆగిపోయిందని తెలుసుకున్న ఇద్దరు కూడా దూకి ప్రాణాలు కాపాడుకుందామనుకున్నారు. అనుకున్నట్టుగానే తోటి యువకుడు ఈత కొడుతూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. యశ్వంత్ మాత్రం సముద్రంలో చిక్కుకున్నాడు. బయటకు రాలేకపోయాడు. సముద్రంలో మునిగిపోయిన యశ్వంత్ మృత దేహం సోమవారం సాయంత్రం బయటపడింది.
సోమవారం మృతదేహం లభ్యం
ప్రమాదం జరిగిన వెంటనే విషయాన్ని ఫ్యామిలీకి చేరవేశారు యశ్వంత్ ఫ్రెండ్స్. గల్లంతైన యశ్వంత్ కోసం వెతుకుతున్నాని చెప్పారు. సోమవారం సాయంత్రానికి యశ్వంత్ చనిపోయినట్టు సమాచారం అందించారు. మృతదేహం కూడా లభించిందని తెలిపారు. యశ్వంత్ మరణ వార్త విన్న కన్నవారు బోరున విలపిస్తున్నారు. యశ్వంత్ తండ్రి మల్లేశం చందుర్తిలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈ వార్త యశ్వంత్ ఫ్యామిలీలోనే కాదు కరీంనగర్‌లోని తీవ్ర విషాదం నింపింది.