సూపర్ స్టార్ కృష్ణ.. టాలీవుడ్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ఇప్పుడు ఆయన వారసుడు మహేష్ బాబు సైతం సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించి టాలీవుడ్‌నే ఏలుతున్నారు. కొడుకు తన పేరును నిలబెట్టే స్థాయికి ఎదిగాడంటే.. ఏ తండ్రికైనా తప్పకుండా గర్వం ఉంటుంది. సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణ సైతం మహేష్ బాబు సక్సెస్‌ను చూసి గర్వపడుతున్నారు. మే 31న పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ.. ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేనికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. 


మహేష్ బాబును హీరోగా చేయాలని చిన్నప్పుడే ప్లాన్ చేశారా? కావాలనే బాల్యంలో మహేష్ బాబుతో సినిమాలు తీశారా? అని మంజుల ప్రశ్నించారు. ఇందుకు కృష్ణ సమాధానమిస్తూ.. ‘‘మహేష్ బాబుతో సినిమాలు తీయాలనే ప్లాన్ ఏదీ లేదు. అయితే, ఒక రోజు నాతోపాటు షూటింగ్‌కు వచ్చాడు. మెట్ల మీద కూర్చొని శ్రద్ధగా చూస్తున్నాడు. అప్పుడు కోడి రామకృష్ణ మహేష్ బాబును చూసి ఎవరా అబ్బాయి అని అడిగారు. దీంతో సెట్‌లో ఉన్నవారు కృష్ణగారి అబ్బాయని చెప్పారు. దీంతో ఆయన మా సినిమాలో చేస్తావా అని అడిగారు. నేను సినిమాలు చేయను అంటూ స్టూడియో చుట్టూ పరుగులు పెట్టాడు. అప్పట్లో మన ఇంటి పక్కన ఉండే రామచంద్ర ఆ సినిమాకు కో-డైరెక్టర్. అతడు మహేష్‌కు ఏం చెప్పారో ఏమో.. సినిమాకు ఒప్పుకున్నాడు’’ అని కృష్ణ తెలిపారు. ‘‘మహేష్ బాబు ‘పోకిరి’ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడే చెప్పా. అది ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని. ‘దూకుడు’ కూడా మహేష్‌తో కలిసి చూశా. ఆ రెండూ ఇప్పుడు ల్యాండ్ మార్కులు అయ్యాయి’’ అని పేర్కొన్నారు. 


Also Read: ఫ్యామిలీతో లంచ్ అండ్ కేక్ కటింగ్ - సూపర్ స్టార్ కృష్ణ బ‌ర్త్‌డే సెలబ్రేషన్స్


మహేష్ బాబు గురించి డూండీ అప్పుడే చెప్పారు: ‘పోరాటం’ ప్రివ్యూ చూసేందుకు ప్రముఖ దర్శకుడు, నిర్మాత పోతిన డూండీశ్వరరావు(డూండీ) వచ్చారు. ఆ పిల్లాడు ఎవరో బాగా చేశాడు. పెద్ద స్టార్ అవుతాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. అంత చిన్న వయస్సులోనే అతడిలో ఈజ్ ఉంది’’ అని తెలిపారని కృష్ణ తెలిపారు. ఇదే విషయాన్ని దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సినిమాలు చేస్తేవా అంటే మహేష్ బాబు చేయను అన్నాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. ఎందుకు చేయవూ అంటే సినిమాల్లో చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి కదా మనం. మా నాన్నగారిని చూస్తున్నాను కదా. చిన్నప్పుడు మహేష్ బాబులో ఆ అవగాహన గమనించాం. నువ్వు మీ నాన్నగారిలా ఉంటావు. భవిష్యత్తులో ఆయన పేరు నిలబెట్టాలంటే నువ్వు కూడా నటించాలని చెప్పాను. దీంతో ఆ సినిమా(పోరాటం)లో కృష్ణగారికి తమ్ముడిలా నటించాడు’’ అని అన్నారు.


Also Read: ‘మీలా మరెవ్వరూ ఉండరు నాన్న’ కృష్ణకు మహేష్ బాబు ఎమోషనల్ విషెస్!