ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల విడుదలైన సినిమా టీజర్ అంచనాలు తారుమారయ్యేలా చేసింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు కార్టూన్ మూవీని తలపించాయి. అలాగే వానర సేనను కూడా అభ్యంతరకరంగా చూపించారని, VFX సీన్స్ మరీ దారుణంగా ఉన్నాయని ట్రోల్ చేశారు.
దిద్దుబాటు చర్యల్లో భాగంగా త్రీడీ టీజర్ ను మీడియాకు చూపించి నెగెటివిటీను తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ.. జనాల్లో మాత్రం సినిమా మీద పూర్తి భరోసా అయితే లేదు. ఈ క్రమంలో ఇప్పటికే రెడీ చేసిన సినిమాను యాజిటీజ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే.. ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే భయాలు చిత్రబృందాన్ని వెంటాడుతున్నాయి.
సినిమాలో చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడ్డ సన్నివేశాలే ఉన్నాయి. కాబట్టి మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ క్రమంలో వీలైనన్ని ఎక్కువ కరెక్షన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన జెన్యూన్ ఫీడ్ బ్యాక్ తీసుకొని ఆ మేరకు మార్పులు చేయడానికి చూస్తున్నారట. అయితే పూర్తిగా ప్రేక్షకుల ఫీలింగ్ కు తగ్గట్లుగా మార్చాలంటే మాత్రం చాలా సమయం పడుతుంది.
సంక్రాంతి రిలీజ్ డేట్ ను అందుకోవడం కష్టమవుతుంది. అలా అని ఉన్నది ఉన్నట్లుగా సినిమాను రిలీజ్ చేయలేరు. కొన్ని కరెక్షన్స్ చేసి సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దామా..? లేక ఎక్కువ సమయం తీసుకొని ప్రేక్షకులు ఆశిస్తున్నట్లుగా మార్పులు చేసి సమ్మర్ లో రిలీజ్ చేద్దామా..? అనే విషయంలో చిత్రబృందం డైలమాలో పడింది. ప్రస్తుతానికైతే.. సంక్రాంతి రిలీజ్ డేట్ కి కట్టుబడే పనులు చేసుకుంటున్నారు.
'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది.
Also Read : వసూళ్ల వేటలో 'కాంతార' దూకుడు - మూడో రోజూ రఫ్ఫాడించిన రిషబ్ శెట్టి
మార్వెల్ రేంజ్‌లో 'ఆదిపురుష్':
కొన్నాళ్ల క్రితం రామాయణం ఆధారంగా తీసిన జపనీస్ యానిమేషన్ ఫిల్మ్ చూశానని.. మన పురాణాల గురించి తెలియని ఎవరో అలాంటి సినిమా తీసినప్పుడు మనమెందుకు తీయకూడదనే ఆలోచనతో 'ఆదిపురుష్'ని తెరకెక్కించినట్లు చెప్పారు ఓం రౌత్. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేటి జెనరేషన్ కి అర్ధమయ్యేలా తీయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. రామాయణాన్ని చాలా కోణాల్లో తెలుసుకున్నానని.. అయితే ఈ జెనరేషన్ వారికి మార్వెల్స్, హ్యారీ పోటర్ వంటి సినిమాలు బాగా కనెక్ట్ అవుతుండడంతో.. అది దృష్టిలో పెట్టుకొని 'ఆదిపురుష్' తీసినట్లు చెప్పారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీయలేదని.. మోడర్న్ పెర్స్పెక్టివ్ లో సినిమా తీశానని అన్నారు.
హాలీవుడ్ లో 'ఆదిపురుష్':
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.