Tamannaah About Director Sampath Nandi: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగులో అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించింది. అందం, అభినయంతో తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత కొంత కాలంగా నార్త్ కు మకాం మార్చింది. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతోంది. ప్రస్తుతం మళ్లీ తెలుగు తెరపై తళుక్కున మెరవబోతోంది.


‘ఓదెల 2’లో శివ శక్తిగా తమన్నా


గతంలో ఓటీటీలో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న సినిమా ‘ఓదెల రైల్వేస్టేషన్’. సంపత్‌ నంది, హెబ్బాపటేల్‌ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి తమన్నా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తమన్నా లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.  ఇప్పటి వరకు గ్లామరస్, స్టైలిష్ పాత్రలు పోషించిన తమన్నా, ఈసారి శివశక్తిగా మారిపోయింది. ఈ చిత్రంలో తమన్నా శివుడి భక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘ఓదెల-2’ కోసం తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నట్లు తెలిపారు. పెద్ద జుట్టుతో నాగ సాధువులా కనిపించింది.  ఒక చేతిలో సాధువు కర్ర, మరో చేతిలో ఢమరుకం పట్టుకుని శివశక్తిలా దర్శనం ఇచ్చింది. కాశీ ఘాట్ లపై నడుస్తూ దేవుడిని ప్రార్థిస్తూ కనిపించింది.  


సంపత్ నందిపై తమన్నా ప్రశంసలు


ఇక తాజాగా దర్శకుడు సంపత్ నందిపై తమన్నా ప్రశంసల వర్షం కురిపించింది. సంపత్ నంది చేసిన ఓ ట్వీట్ ను షేర్ చేస్తూ.. కీలక విషయాలను వెల్లడించింది. సంపత్ నంది లాంటి వ్యక్తిని తన 19 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి అభినందించడం ఆయన గొప్ప గుణానికి నిదర్శనం అని చెప్పుకొచ్చింది. ఇటీవల రిలీజైన తమన్నా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు విశేష స్పందన రావడంపై డైరెక్టర్ సంపత్ నంది స్పందించారు. ఈ మేరకు  ట్విటర్ వేదికగా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నుంచి తమన్నా వ్యక్తిగత సిబ్బంది వరకు అందరినీ అభినందించారు. ఈ నేపథ్యంలో ఆయనను ట్విట్టర్ వేదికగా తమన్నా ప్రశంసించింది.  ‘ఓదెల 2’ సినిమాను సంపత్ నంది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.  హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌. సింహ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాల్లో తమన్నా నటించింది. ‘బెంగాల్‌ టైగర్‌’, ‘సీటీమార్‌’ సినిమాల్లో అందం, అభినయంతో అలరించింది.  






Read Also: థియేటర్లలో అలా, ఓటీటీలో ఇలా.. టాప్‌లో ట్రెండింగ్ లో సందీప్ కిషన్ ఫాంటసీ థ్రిల్లర్