Pranita Subhash Blessed With Baby Boy: తెలుగు సినిమా పరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ప్రణీత... రెండో సారి తల్లి అయ్యింది. తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబును ప్రణీత తన చేతుల్లోకి తీసుకుని అపురూపంగా ముద్దాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రణీత భర్త నితిన్ రాజు కూడా ఉన్నారు. ప్రణీత అభిమానులతో పాటు సినీ అభిమానులు, సినీ ప్రముఖులు ప్రణీతకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఫస్ట్ పాప, ఇప్పుడు బాబు. క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


చాలా సంతోషంగా ఉన్నాం- ప్రణీత


బాబు పుట్టిన తర్వాత ప్రణీత తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. “బాబు పుట్టినందకు మేం సంతోషంగా ఉన్నాం. మా పాప అర్నా తమ్ముడిని చూసి ఆనందంతో డ్యాన్స్ చేసింది. అక్క తమ్ముడిని ‘బేబి’ అంటూ ప్రేమగా పిలుస్తోంది. తొలిసారి డెలివరీ సమయంలో చాలా టెన్షన్ పడ్డాను. రెండోసారి అంతగా కంగారు అనిపించలేదు. చాలా నార్మల్ గా అనిపించింది” అని ప్రణీత వెల్లడించింది.


తల్లి హాస్పిటల్ లోనే డెలివరీ


హీరోయిన్ ప్రణీత తల్లి ప్రముఖ గైనకాలజిస్టు. తొలి డెలివరీ ఆమె హాస్పిటల్ లోనే జరిగింది. ప్రణీత రెండో డెలివరీ కూడా తన తల్లి గారి హాస్పిటల్ లోనే అయ్యింది. గైనకాలజిస్టుగా కర్నాటకలో ప్రణీత తల్లి గారికి మంచి పేరు ఉంది. వైద్యరంగంలో ఆమె చేసుకున్న సేవలకు పలు అవార్డులు అందుకున్నారు.


తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రణీత


కన్నడ బ్యూటీ ప్రణీత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. 2010లో ‘పోర్కీ’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రణీత,  ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘బావ’, ‘అత్తారింటికి దారేది’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రభస’, ‘బ్రహ్మోత్సవం’, సహా పలు చిత్రాల్లో నటించింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తో కలిసి నటించింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ, తమిళం, హిందీలోనూ పలు సినిమాలు చేసింది ప్రణీత. పలు టీవీ షోలకు జడ్జిగానూ వ్యవహరించింది. తెలుగులో ఢీ డ్యాన్స్ షోకు కొద్ది రోజుల పాటు న్యాయ నిర్ణేతగా ఉన్నది.


2021లో వ్యాపారవేత్తతో ప్రణీత వివాహం


2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, తన బాల్య స్నేహితుడు నితిన్‌ రాజును ప్రణీత పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు జూన్ 2022లో పాప పుట్టింది. ఆమెకు అర్నా అని పేరు పెట్టారు.  పాప పుట్టిన తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పాప జన్మించిన రెండు సంవత్సరాల తర్వాత మరో బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బెంగళూరులో ఉంటున్నది.  



Read Also: అర్జున్ సర్కార్... అతనే ఓ ప్రమాదం - రిలీజ్ డేట్‌తో 'హిట్ 3' అనౌన్స్ చేసిన నాని