Ambedkar Konaseema District: అరచేతిలో ప్రపంచాన్ని చూసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో కూడా కొంతమంది చేస్తున్న పనులు ప్రజలను భయపెడుతున్నాయి. మూఢ నమ్మకాల జాడ్యంలో ఇంకా కొందరు కొట్టిమిట్టాడే దుస్థితిలోనే ఉండిపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయని నమ్మించి సొమ్ము చేసుకుంటున్నారు. తాంత్రిక పూజలతో మాయలు చేస్తున్నారు. ఈ విష సంస్కృతితో కొందరు భయాందోళనలకు గురి అవుతున్నారు. 


అమలాపురంలో ఓ ఇంటిముందు క్షుద్రపూజలు
అంబేడ్కర్‌ కోనసీమలో ఈ తరహా క్షుద్రపూజల వ్యవహారాలు వెలుగులోకి వచ్చింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఓ ఇంటి వద్ద క్షేద్రపూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు  ఉదయాన్ని లేచి చూస్తే ఇంటి ముంగిట్లో సూదులతో గుచ్చిన నిమ్మకాయలు, ఎర్ర రంగు నీళ్లు, ముగ్గు వేసి అందులో కోడిగుడ్లు కనిపించాయి. అక్కడే కుంకుమ చల్లి ఏవో తాళ్లు కట్టిన దృశ్యాలు స్థానికులను కలవర పరిచాయి. 


అమలాపురం పట్టణంలోని స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి సమీపంలోని తంగెళ్ల సత్యనారాయణమూర్తి, మాణిక్యాలరావు సోదరుల ఇంటి ముంగిట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పూజలు చేశారు. ఈ దృశ్యాలు చూసి ఆ కుటుంబీకులే కాదు చుట్టుపక్కలనున్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అమావాస్య రోజున వీళ్లంతా ఏదో చేశారని కలత చెందారు. 


ఈ దుశ్చర్యకు పాల్పడింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అర్చకులేనని అనుమానిస్తున్నారు. ఇద్దరి అనుమానితులపై పట్టణ పోలీసులకు తంగెళ్ల సత్యనారాయణ మూర్తి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సిసిటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 


కాండ్రకోటలాంటి సీన్లు రిపీట్‌..
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పరిధిలోని కాండ్రకోట గ్రామంలో దాదాపు నెల రోజులపాటు గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అక్కడ కూడా గ్రామంలోని కొన్ని ఇళ్ల వద్ద క్షేద్రపూజలతో మొదలైన భయం గ్రామంలో అదృశ్యశక్తి తిరుగుతందని దావానంలా వ్యాపించింది. ఇది గ్రామస్తులను తీవ్ర భయాందోళనల్లోకి తీసుకెళ్లింది.


Also Read: పరాయి వ్యక్తితో మాట్లాడింద‌ని దారుణం, ఆ వ్యక్తితో వివాహితకు బలవంతంగా పెళ్లి!


రాత్రి ఎనిమిది అయితే చాలు బయట ఒక్క మనిషి కూడా కనిపించేవాళ్లు కాదు.ఇంటి చుట్టూ ఫ్లడ్‌ లైట్లు పెట్టుకుని మరీ బిక్కుబిక్కుమంటూ గడిపిన రోజులు కాండ్రకోటలో చాలారోజులు కనిపించాయి. రాత్రివేళల్లో కర్రలు, కత్తులు పట్టుకుని గస్తీ కాచారు కూడా. అయితే ఆ భయం క్రమక్రమంగా తగ్గి అక్కడ నెల రోజుల తరువాత సాధారణస్థితికి వచ్చింది..  



కోనసీమలోనూ తరచూ ఈ తరహా ఘటనలు..
అన్ని విధాలుగాను చైతన్యవంతమైన ప్రాంతంగా కోనసీమ ప్రాంతానికి పేరుంది. ఇక్కడ మూఢనమ్మకాలను అంతగా ఎవ్వరూ నమ్మేపరిస్థితి ఉండేది కాదు. పైగా ఎక్కడైనా ఆ తరహా ఘటనలు జరిగితే మెజార్టీ శాతం అది పుకారు అని కొట్టిపడేసే పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో క్షుద్రపూజల ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో ఓ ఇంటి వద్ద క్షుద్రపూజలు చేసిన ఉదంతం కలకలం రేపింది. ఇక్కడా ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో కూడా ఈ తరహా ఉదంతాలు కనిపించాయి.. తాజాగా అమలాపురం పట్టణ నడిబొడ్డున క్షుద్రపూజలు వ్యవహారం కలకలం రేపింది.. 


Also Read: ఉభయగోదావరి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం- లోతట్టు ప్రాంతాలు జలమయం