Actress Nivetha Thomas On Justice Hema Committee Report: మలయాళీ సినీ పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్టు తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది మహిళలు తమకు గతంలో ఎదురైన వేధింపుల గురించి బయటకు వచ్చి చెప్తున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులపై కేసులు నమోదు అయ్యాయి. మరికొందరు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా హేమ కమిటీ రిపోర్టుపై హీరోయిన్ నివేదా థామస్ స్పందించారు.
వర్క్ ఫ్లేస్ లో సెక్యూరిటీ చాలా ముఖ్యం- నివేదా
నివేదా నటించిన ‘35-చిన్న కథ కాదు’ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న ఆమె మలయాళ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు, హేమా కమిటీ రిపోర్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మలయాళీ సినీ పరిశ్రమలో జరుగుతున్న తాజా పరిణామాలు నిజంగా బాధకరం అన్నారు. “ప్రస్తుతం నేను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA)లో సభ్యురాలిగా ఉన్నాను. హేమ కమిటీలో వెల్లడించిన అంశాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. కమిటీ నివేదికలోని అంశాల గురించా చాలా ఆలోచించాను. మా ఇంట్లోనూ డిస్కస్ చేశాను.
ప్రస్తుతం జరుగుతున్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాను. ఇండస్ట్రీలో వేధింపుల వ్యవహారాల గురించి తెలుసుకునేందుకు చాలా మందితో డిస్కస్ చేశాను. WCC చొరవను నేను ప్రశంసిస్తున్నాను. వారి వల్లే మలయాళీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అంశాలు బయటకు వచ్చాయి. కేవలం మహిళలలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ వర్క్ ప్లేస్ లో ఇబ్బందులు లేని వాతావరణాన్ని కల్పించాలి. చాలా మందిమి ఇంట్లో కంటే ఎక్కువగా వర్క్ ప్లేస్ లోనే ఉంటున్నాం. అక్కడ భద్రత అనేది చాలా ముఖ్యం” అని వెల్లడించారు. ప్రస్తుతం నివేదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సెప్టెంబర్ 6న ‘35-చిన్న కథ కాదు’ మూవీ విడుదల
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన ‘35-చిన్న కథ కాదు’ సినిమా తెరకెక్కింది. హీరో రానా సమర్పణలో రూపొందిస్తున్న ఈ మూవీకి నందకిషోర్ ఈమాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నివేదా ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 6న విడుదలకానుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా గురించి నివేదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను అన్ని రకాల పాత్రలను చేయగలను అని చెప్పడానికే ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించినట్లు వెల్లడించారు. ఈ సినిమా ప్రభావం తన తర్వాతి సినిమాల మీద ఉంటుందని తెలిసినా, క్యారెక్టర్ నచ్చడంతో చేశానని చెప్పుకొచ్చారు. ఒకే తరహా పాత్రలు కాకుండా అన్ని పాత్రలు చేసినప్పుడే పూర్తి స్థాయి నటిగా గుర్తింపు లభిస్తుందన్నారు.