Gudlavalleru SRG College Incident : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరులోని ఎస్‌ఆర్‌జీ ఇంజినీరింగ్ కళాశాల ఘటనపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కాలేజీ హాస్టల్ మొత్తం తనిఖీ చేశామని, అయితే ఎలాంటి కెమెరాలు లేవని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీక్రెట్ కెమెరాలను గుర్తించే ప్రత్యేక ఎలక్ర్టానిక్ డివైజ్‌లను ఉపయోగించి తనిఖీలు నిర్వహించినట్టు ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థుల ఉద్రికత్తలను చల్లార్చేందుకు సోమవారం వరకు కాలేజీకి సెలవులు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపించేశారు.
విద్యార్థినులంతా సంఘటితమై నిరసన..
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినుల హాస్టల్ బాత్రూమ్‌లలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారని కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లోనే ఉండే ఒక విద్యార్థిని కొంత తన బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ కెమెరాలు పెట్టించారని ప్రచారం జరుగుతోంది. బాత్రూమ్‌లలో రికార్డ్ అయిన 300 వరకు వీడియోలు ఆమె తన స్నేహితులకు అమ్ముకుందని కూడా సహచర విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా ఈ తంతు జరుగుతోందనే అనుమానాలు విద్యార్థినులు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వందల సంఖ్యలో విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకొచ్చి ఆందోళన నిర్వహించారు. మొన్న అర్థరాత్రి నుంచి వియ్ వాంట్ జస్టిస్ అంటూ ఎవరైతే అనుమానితురాలిగా భావిస్తున్నా అమ్మాయి ని చుట్టుముట్టి నినాదాలు చేసిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వైరల్ అయ్యాయి. ఈ తతంగం గురించి నెలరోజులుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలేజీ విద్యార్థినులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సోషల్ మీడియా వీడియోలు, ఆడియో రికార్డింగులు
గుడ్లవల్లేరు ఘటనకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో పలు రకాల వీడియోలు, కాలేజీలో చదవుకుంటున్న విద్యార్థులు కాల్ రికార్డింగులు వైరల్ అవుతున్నాయి. నిందితుడిగా భావిస్తున్న విద్యార్థిని, ఆమె బాయ్ ప్రెండ్‌గా భావిస్తున్న విద్యార్థికి సంబంధించిన వీడియోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. అనుమానితుడిగా ఉన్న విద్యార్థిని పోలీసులు విచారిస్తున్నట్టుగా ఒక వీడియో ప్రచారంలో ఉండగా, అతడికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్క్రీన్ షాట్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతోపాటు విద్యార్థినులు హాస్టల్ బాత్రూమ్‌లలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని విద్యార్థినులంతా చుట్టుముట్టిన ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. అందరూ ఆమెను ప్రశ్నిస్తుంటే తాను మాత్రం చాలా నిర్లక్ష్యంగా మీకు నచ్చింది చేసుకోండంటూ దురుసుగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అనుమానితురాలిగా పేర్కొంటున్న విద్యార్థినిని అర్థరాత్రి పోలీసులు రహస్యంగా కారులో తరలించినట్టు మరో వీడియో రావడంతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఉదయం నుంచి కాలేజీలో చదివే ఒకమ్మాయి తన స్నేహితురాళ్లకు పంపిన ఆడియో రికార్డింగులు వైరల్ అవుతున్నాయి. తాను చాలా భయపడిపోతున్నానని, పోలీసులు అసలు పట్టించుకోవడం లేదని వాపోయింది. పైగా మీ వీడియోలు కనిపించినప్పుడు తీసుకురండి పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తన జీవితాలు రోడ్డున పడితే, ఈ పని చేసిన అమ్మాయి మాత్రం చాలా ధీమాగా దిక్కున్న చోట చెప్పుకోమని మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తోందని వాపోయింది.
విద్యార్థినుల ఫిర్యాదులను పట్టించుకోని కళాశాల యాజమాన్యం
గుడ్లవల్లేరులోని ఎస్‌ఆర్‌జీ ఇంజినీరింగ్ కళాశాల మహిళల బాత్రూమ్‌లో బాలికల వసతిగృహంలోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి రికార్డింగులు చేస్తున్నారని మూడు రోజుల క్రితమే విద్యార్థులు పిర్యాదు చేసినా హాస్టల్ వార్డెన్ పద్మావతి తమ పైనే కేకలు వేసిందని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడిపోతున్నారు. కళాశాల సూపరింటెండెంట్ రవీంద్రబాబుకు ఫిర్యాదు చేశామన్నారు. ఇంజినీరింగ్ ఫోర్త్ ఇయర్ అమ్మాయి, అదే కాలేజీలో చదివే మరో అబ్బాయితో ప్రేమలో ఉందని, వారి ద్వారానే ఈ వ్యవహారం నడుస్తోందని చెప్పినా వారిద్దర్నీ పిలిచి తూతూమంత్రంగా విచారించి వదిలేశారని కాలేజీ విద్యార్థులంతా ఆరోపిస్తున్నారు. అందుకే విద్యార్థినులంతా మూకుమ్మడిగా హాస్టల్ నుంచి బయటకొచ్చి భారీగా నిరసన వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. గుడ్లవల్లేరు రూరల్ సీఐ, గుడివాడ రూరల్ సీఐ నిందితులిద్దరి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు తీసుకుని పరిశీలించగా, ప్రేమికులిద్దరి ఛాటింగ్ తప్ప ఇంకేమీ కనిపించలేదని చెప్పారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వైసీపీ, ఏబీవీపీ ధర్నా
ఈ ఘటనపై బీజేపీ అనుబంధ విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్ , వైసీపీ నాయకులు కాలేజీ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు మాత్రం వారిని కాలేజీ లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో వాళ్లంతా గేటు బయటే ఉండిపోయి విద్యార్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. తమను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేశారు. అర్థరాత్రి వరకు వర్షంలోనే తడుస్తూ ధర్నాలు చేశారు.
ఫేక్ సమాచారంతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించేందుకు విషయాన్ని రాజకీయం చేసేందుకే వైసీపీ, వారికి మద్దతు ఇస్తున్న సోషల్ మీడియా పేజీలు పోస్టులు పెడుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది.
Also Read: గుడ్లవల్లేరు కాలేజి ఘటనపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు!
Also Read: గుడ్లవల్లేరు ఘటన - ప్రతి 3 గంటలకోసారి రిపోర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు