CM Chandrababu Key Orders On Gudlavalleru Incident: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని (Gudlavalleru Engineering College) హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే అంశంపై విచారణను సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా అధికారులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించిన సీఎం.. విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి విచారణ సాగుతోన్న విధానంపై ఆరా తీశారు. ప్రతి 3 గంటలకోసారి తనకు రిపోర్ట్ చేయాలని అధికారులకు నిర్దేశించారు.
మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో.. అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలని సీఎం అన్నారు. విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణలోకి తీసుకుని పటిష్ట దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నేరం జరిగినట్లు రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలపైనా విచారణ జరపాలని.. కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ అధైర్య పడొద్దని.. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే.?
కృష్ణా జిల్లా (Krishna District) గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలోని అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాను కొందరు విద్యార్థినులు గురువారం గుర్తించి హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాలేజీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ అమ్మాయే ఈ దారుణానికి పాల్పడినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొంటున్నారు. సీఎం ఆదేశాలతో ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీలను విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిందని.. దోషులు ఎంతటివారైనా వదిలేది లేదని మంత్రి స్పష్టం చేశారు. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.
విద్యార్థినుల ఆందోళన
అటు, ఈ ఘటనపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ నిరసనలు కొనసాగాయి. అటు, విద్యార్థి సంఘాల నేతలు సైతం కాలేజీ వద్ద ఆందోళన నిర్వహించగా ఉద్రిక్తత నెలకొంది. న్యాయం చేసేంత వరకూ, నేరస్థులను శిక్షించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘం నేతలు తెలిపారు. సీక్రెట్ కెమెరా గురించి వారం ముందు నుంచే యాజమాన్యానికి చెబుతున్నా పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే ఆ న్యూస్ ఫేక్ అని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. న్యాయం చేయాలని అడుగుతుంటే మళ్లీ తమ మీదే రివర్స్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఉద్రిక్తతల క్రమంలో కాలేజీ యాజమాన్యం సెలవు ప్రకటించింది.
Also Read: West Godavari News: ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన ప్రేమజంట - ప్రియురాలిని కాపాడి ప్రియుడు మృతి