ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేశారు వేణు తొట్టెంపూడి. ఆయన కెరీర్ లో చాలా హిట్స్ ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. చాలా కాలం తరువాత ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. రవితేజ నటిస్తోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు వేణు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారాయన.
ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'దమ్ము' సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. బోయపాటి తెరకెక్కించిన 'దమ్ము'లో వేణు చిన్న క్యారెక్టర్ చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ''షోలే సినిమాలో అమితాబ్ లాంటి క్యారెక్టర్ అన్నారు. తీరా చూస్తే ఏం జరిగిందో మీకే తెలుసు. షోలేలో అమితాబ్ చనిపోయినట్లు 'దమ్ము' సినిమాలో నా క్యారెక్టర్ కూడా చనిపోతుంది. ఈ రెండు సినిమాల మధ్య పోలిక అదొక్కటే'' అంటూ సెటైర్లు వేశారు.
అయితే ఆ సినిమా చేసినందుకు ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదని అన్నారు. సినిమా అనేది ఓ ప్రయాణమని.. ఆ దారిలో తనకొచ్చిన పాత్రలను గౌరవించుకుంటూ వెళ్లానని.. ఓ తప్పు చేస్తే అక్కడితో ప్రయాణం ఆడిగిపోయినట్లు కాదని చెప్పుకొచ్చారు. ఇక 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో సీఐ మురళి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు వేణు. రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించడం ఆనందంగా ఉందని.. పెద్ద సినిమాతో రీఎంట్రీ ఇస్తే చాలా మంది చేరువవుతానే నమ్మకంతో ఒప్పుకున్నానని వెల్లడించారు.