‘‘తెలుగు సినిమాలు చెయ్యడానికి తెలుగు హీరోలు లేరా? ఎక్కడో మలయాళం నుంచి మమ్ముట్టి గారి కొడుకు రావాలా?’’ అని నటుడు సంతోష్ శోభన్ అసహనం వ్యక్తం చేశారు. ‘సీతారామం’ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే, సంతోష్ ఈ వ్యాఖ్యలను సరదాగా చేసినా.. మనసులో మాటను బయటకు చెప్పేశాడా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.
‘సీతారామం స్వరాలు’ పేరుతో చిత్ర బృందం ఓ మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సామాజిక మధ్యమాల్లో విడుదల చేసింది. ఈ వేడుకకు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నటుడు సంతోష్, హీరోయిన్ మాళవిక కూడా వచ్చారు. వాళ్ళని యాంకర్ సుమ వేదిక మీదకి రమ్మని పిలిచింది. అప్పుడు సంతోష్ మాట్లాడుతూ.. ‘‘మనలో మన మాట తెలుగు సినిమాలు చెయ్యడానికి తెలుగు హీరోలు లేరా? ఎక్కడో మలయాళం నుంచి మమ్ముట్టి గారి కొడుకును తీసుకురావాలా? అని అన్నారు. దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు ఇప్పుడు’’ అని సంతోష్ అన్నాడు. ‘‘తెలుగులో కొన్ని ప్రశ్నలు వేస్తాను. అందుకు దుల్కర్ సరైన సమాధానాలు చెప్తే తెలుగు హీరో అని ఒప్పుకుంటా’’ చెప్పారు. అయితే, దుల్కర్.. శోభన్ అడిగిన అన్ని ప్రశ్నలకు తెలుగులో సమాధానం చెప్పేసి ఆశ్చర్యపరిచాడు.
ఈ వేడుకకి సంతోష్, మాళవిక రావడానికి మరో కారణం కూడా ఉంది. వైజయంతీ మూవీస్ నెట్ వర్క్ స్వప్న సినిమాస్ మీద సంతోష్ హీరోగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం తెరకెక్కుతోంది. అందుకే ఈ కార్యక్రమానికి ఆ సినిమాలో నటిస్తోన్న సంతోష్, మాళవిక కూడా వచ్చారు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వస్తోన్న సినిమా ‘సీతారామం’. ఇందులో దుల్కర్ కి జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు మృణాల్ పరిచయమవుతోంది. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ యుద్ధం రాసిన ప్రేమ కథ అంటూ 20 ఏళ్ల క్రితం ఓ సైనికుడికి.. అమ్మాయికి మధ్య సాగిన ప్రేమను ఇందులో చూపించబోతున్నారు. ఆగస్టు 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు.
Also Read: సెక్యూరిటీ పెంచిన సల్మాన్ ఖాన్ - సేఫ్టీకిగన్ లైసెన్స్, ఇప్పుడు కారుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్
Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?