హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్ధ్ గారు గురువారం నాడు కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. నిఖిల్ కి తన తండ్రితో ఎమోషనల్ బాండింగ్ ఉంది. దీంతో తండ్రి మరణాన్ని భరించలేకపోతున్నారు. ఈ క్రమంలో తన తండ్రిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 


''మా నాన్న శ్యామ్ సిద్ధార్థ్ గారు నిన్న మరణించడం ఎంతో బాధను కలిగించింది. అతడు మంచి వ్యక్తి.. వేలాది మంది విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు చాలా మంది కెరీర్ సెటిల్ అవ్వడానికి గైడ్ చేశారు. తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి కృషి చేశారు. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఆయన వీరాభిమాని. సినిమాలంటే పిచ్చి. నన్ను ఏదోక రోజు వెండితెరపై చూడాలనేది ఆయన కల. 


ఆయనిచ్చిన మోటివేషన్, సపోర్ట్ కారణంగానే నేను ఈరోజు ఇలా ఉన్నాను. తనను తానుగా చదువుకోవడానికి పని కూడా చేసేవారు. మాకు మంచి జీవితం అందించడానికి ప్రతిరోజూ కష్టపడేవారు. JNTU ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో స్టేట్ టాపర్ ఆయన. హార్డ్ వర్క్ ని మాత్రమే ఆయన నమ్మేవారు. అలాంటి వ్యక్తి అరుదైన వ్యాధి బారిన పడ్డారు. కార్టికో బేసల్ డీజెనరేషన్.. గత 8 సంవత్సరాలుగా ఆయన ఆ వ్యాధితో పోరాడారు. మాతో కలిసి ఉండడానికి తనవంతు కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తు నిన్న ఆయన తుది శ్వాస విడిచారు. 


మీరు ఎక్కడ ఉన్నా మీకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను నాన్న. మేము నిన్ను ప్రేమిస్తున్నాం.. చాలా మిస్ అవుతున్నాం. మీ గురించి ఆలోచించకుండా మాకు ఒక్కరోజు కూడా గడవదు. క్రాస్ రోడ్ మూవీ, బిర్యానీ ఔటింగ్‌లు, లాంగ్ డ్రైవ్‌లు, ముంబయిలో సమ్మర్‌లు... అన్నీ మిస్ అవుతాం. నేను మీ కుమారుడిగా ఎప్పుడూ గర్వపడుతున్నానని చెప్పాలనుకుంటున్నాను. మనం మళ్లీ కలుద్దామని ఆశిస్తున్నాను నాన్న'' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.