రోహిణి కార్తెలు దగ్గరపడుతున్నాయి.ఎండ వేడిమి కూడా అందుకు తగ్గట్టే పెరుగుతున్నాయి. చాలా చోట్ల 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పనుల మీద బయట తిరిగే వారు, రేకుల షెడ్డుల్లో, పై అంతస్థుల్లో జీవించే వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. కానీ చాలా మందికి వడదెబ్బ లక్షణాలు కూడా పెద్దగా తెలియవు. జ్వరం వచ్చినా దాన్ని సాధారణంగా జ్వరంగా భావించి తేలికగా తీసుకుంటారు. ఈ కాలంలో జ్వరం వస్తే అది వడదెబ్బ మూలంగానేమోనని అనుమానించాలి. ముందుగా అందరూ వడదెబ్బ లక్షణాలను తెలుసుకోవాలి. 


1. విపరీతంగా జ్వరం
2. నోరు, నాలుక ఎండిపోతుండడం
3. తలనొప్పి
4. శరీరం నీరసంగా మారడం
5. బరువు తగ్గడం
6. యూరిన్ రంగు మారడం
7. కళ్లు తిరిగి పడిపోవడం


పై లక్షణాల్లో ఏవి కనిపించినా వడదెబ్బగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి.  పిల్లలు, వృద్ధులు, అతిగా మద్యం సేవించే వారు, క్రీడాకారులు, అతి మూత్ర వ్యాధి ఉన్న వారు  అధికంగా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. కనుక వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలను,  వృద్ధులను ఉదయం పూట ఇంటి నుంచి బయటికి పంపకపోవడమే ఉత్తమం.


మద్యం సేవించే వారు...
అప్పుడప్పుడు మద్యం సేవించే వారి పరిస్థితి కాస్త ఫర్వాలేదు కానీ, రోజూ మద్యం తాగేవారు మాత్రం వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాలి. వారి శరీరంలోకి చేరిన మద్యం శరీరంలో నీటిని నిల్వ చేయనివ్వదు. దీని వల్ల వారికి దాహం పెరిగిపోతుంది. త్వరగా వడదెబ్బ బారిన పడిపోతారు. 


తగిలిన వెంటనే ఏం చేయాలి?
వడదెబ్బ  తగిలిన వెంటనే రోగి శరీరాన్ని చల్లని వస్త్రంతో పదే పదే తుడవాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు ఈ పని చాలా అవసరం. రోగికి చల్లని పానీయాలు తాగించాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళితే వైద్యులు వెంటనే సెలైన్లు పెట్టి ప్రాణాంతకం కాకుండా కాపాడుతారు. 


వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ద్రవాహారాన్ని అధికంగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురైతే వడదెబ్బ బారిన త్వరగా పడతాము. కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు చల్లటి నీళ్లు పొట్ట నిండా తాగి వెళ్లాలి. శరీరంలో నీటి స్థాయి పడిపోకుండా చూసుకోవాలి. మసాలా ఆహారాలకు బదులు పండ్లు అధికంగా తినాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, గ్లూకోజ్ నీళ్లు తరచూ తాగుతూ ఉండాలి. 


Also read: ఒక్క ఇంజెక్షన్ మూడు నెలలు గర్భం రాకుండా అడ్డుకుంటుంది, ఇంతకీ ఇది మంచిదేనా?


Also read: అన్నం మిగిలిపోతే ఇలా ఇడ్లీ, దోశెలు, గుంట పొంగనాలు చేసుకోండి