Rain in Telangana Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న వేళ, ఉన్నట్టుండి తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న (ఏప్రిల్ 28) వరుణుడు చల్లగా పలకరించాడు. ఓ వైపు గత వారం రోజుల నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రతిరోజూ అక్కడక్కడా చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కొద్దిసేపు కురుస్తున్నాయి. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి.


తాజాగా హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల మేరకు.. తెలంగాణలో ఒకటి లేదా రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు లేదా చిరుజల్లులు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. కానీ, అధిక ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణం కేంద్రం పసుపు రంగు అలర్ట్ జారీ చేసింది.






తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం - ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో వడ గాడ్పులు వీచే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది’’ అని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. మే 1 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.


ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఏప్రిల్ 30 వరకు జల్లులు అక్కడక్కడ కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, రాత్రికి వర్షాలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువైంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది.






భారత వాతావరణ విభాగం హెచ్చరిక
మరో 5 రోజుల పాటు ఎండలు ఇంకా మండిపోతాయని భారత వాతావారణ విభాగం ప్రకటించింది. తీవ్ర ఎండల కారణంగా రానున్న 5 రోజుల్లో కనీసం 5 రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.


45 డిగ్రీల పైనే
రాజస్థాన్, దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే ఉంటాయని తెలిపింది. మే నెల మొదటివారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాత వర్షాలకు అవకాశాలున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్‌కే జెనమణి పేర్కొన్నారు.


మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ 45 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. దిల్లీలో గురువారం గరిష్ఠంగా 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. శుక్రవారం 45 డిగ్రీల సెల్సియస్ మార్క్‌‌ను తాకే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.


122 ఏళ్లలో
2022 మార్చి - ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. 1901 తర్వాత భారత్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసిన మార్చి నెల.