ఈ సీజన్ ఐపీఎల్‌లో ఢిల్లీకి నాలుగో గెలుపు దక్కింది. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.


అదరగొట్టిన రొవ్‌మన్ పావెల్...
147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి కూడా మంచి ఆరంభం లభించలేదు. మొదటి బంతికే పృథ్వీ షాను (0: 1 బంతి) ఉమేష్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మిషెల్ మార్ష్ (13: 7 బంతుల్లో, రెండు ఫోర్లు) రాగానే రెండు ఫోర్లు కొట్టినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో 17 పరుగులకే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది.


అయితే డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (42: 26 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) దూకుడుగా ఆడటంతో స్కోరు పరుగులు పెట్టింది. మరో ఎండ్‌లో లలిత్ యాదవ్ (22: 29 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) నిదానంగా ఆడినా వార్నర్‌కు చక్కటి సహకారం అందించాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులను ఢిల్లీ సాధించడం విజయం సాధించడం ఇక లాంఛనమే అనుకున్నారంతా.


కోల్‌కతా బౌలర్లు మాయ చేయడంతో వరుస ఓవర్లలో వార్నర్, లలిత్ యాదవ్, రిషబ్ పంత్‌ల (2: 5 బంతుల్లో) వికెట్లను ఢిల్లీ కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రొవ్‌మన్ పావెల్ (33: 16 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), అక్షర్ పటేల్ (24: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడుతూ ఢిల్లీని లక్ష్యం వైపు నడిపించారు. అయితే చివర్లో అక్షర్ పటేల్ అవుటైనా... రొవ్‌మన్ పావెల్ మ్యాచ్‌ను ముగించాడు. కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు తీయగా... హర్షిత్ రాణా, సునీల్ నరైన్‌లకు చెరో వికెట్ దక్కింది. ఏకంగా తొమ్మిది మందితో కోల్‌కతా బౌలింగ్ చేయించడం విశేషం.


నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్ మినహా...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోరుబోర్డు పైన 35 పరుగులు చేరేసరికే నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42: 37 బంతుల్లో, నాలుగు ఫోర్లు), నితీష్ రాణా (57: 34 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అనంతరం కుల్దీప్ యాదవ్... శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆండ్రీ రసెల్ డకౌట్ కావడంతో భారం మొత్తం నితీష్ పైనే పడింది.


నితీష్ రాణాకు రింకూ సింగ్ (23: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) సహకరించడంతో వికెట్ల పతనానికి కాస్త అడ్డుకట్ట పడింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఇది కోల్‌కతా తరఫున ఏడో వికెట్‌కు రెండో అత్యధిక భాగస్వామ్యం. 2020లో ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి జోడించిన 78 పరుగులు ఇంతవరకు రికార్డు. 19 ఓవర్లకు స్కోరు 144 పరుగులకు చేరింది.


క్రీజులో నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్ ఉండటంతో 155-160 పరుగుల స్కోరును దాటుతుందనిపించినా... ముస్తాఫిజుర్ వేసిన చివరి ఓవర్లో మూడు వికెట్లు నష్టపోవడం, రెండు పరుగులు మాత్రమే రావడంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 146 పరుగులు మాత్రమే కోల్‌కతా చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు నాలుగు వికెట్లు దక్కగా... ముస్తాఫిజుర్ మూడు వికెట్లు తీశాడు. చేతన్ సకారియా, అక్షర్ పటేల్ ఖాతాలో చెరో వికెట్ పడింది.