ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు చెలరేగడంతో కోల్‌కతా భారీ స్కోరు చేయలేపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 120 బంతుల్లో 147 పరుగులు కావాలి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోరుబోర్డు పైన 35 పరుగులు చేరేసరికే నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అనంతరం కుల్దీప్ యాదవ్... శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆండ్రీ రసెల్ డకౌట్ కావడంతో భారం మొత్తం నితీష్ పైనే పడింది.
నితీష్ రాణాకు రింకూ సింగ్ సహకరించడంతో వికెట్ల పతనానికి కాస్త అడ్డుకట్ట పడింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఇది కోల్‌కతా తరఫున ఏడో వికెట్‌కు రెండో అత్యధిక భాగస్వామ్యం. 2020లో ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి జోడించిన 78 పరుగులు ఇంతవరకు రికార్డు. 19 ఓవర్లకు స్కోరు 144 పరుగులకు చేరింది.
క్రీజులో నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్ ఉండటంతో 155-160 పరుగుల స్కోరును దాటుతుందనిపించినా... ముస్తాఫిజుర్ వేసిన చివరి ఓవర్లో మూడు వికెట్లు నష్టపోవడం, రెండు పరుగులు మాత్రమే రావడంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 146 పరుగులు మాత్రమే కోల్‌కతా చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు నాలుగు వికెట్లు దక్కగా... ముస్తాఫిజుర్ మూడు వికెట్లు తీశాడు. చేతన్ సకారియా, అక్షర్ పటేల్ ఖాతాలో చెరో వికెట్ పడింది.