ఐపీఎల్‌ 2022 సీజన్‌లో 41వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) తలపడుతున్నాయి. వాంఖడే మైదానం (Wankhede Stadium) ఇందుకు వేదికగా నిలవనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.


ఊపు కావాల్సిందే
ఐపీఎల్‌ 2022 సీజన్లో సగం మ్యాచులు ముగిశాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరుకొనే జట్లేవో చాలామంది ఒక అంచనాకు వచ్చేశారు. మొదట్లో వరుస విజయాలు అందుకోవడంతో కోల్‌కతాకు తిరుగులేదని భావించారు. పెద్ద పెద్ద పేర్లు కనిపించడంతో ఢిల్లీపై క్రేజ్‌ పెరిగింది. అయితే ఈ రెండు జట్లు కొన్ని మ్యాచుల్లో వరుస పరాజయాలు చవిచూడటంతో మూమెంటమ్‌ కోల్పోయాయి. ఢిల్లీ 7 మ్యాచుల్లో 3 గెలిచి 7, కేకేఆర్‌ 8లో 3 గెలిచి 8లో ఉన్నాయి. అంటే వీరు ప్లేఆఫ్స్‌ చేరుకోవాలంటే ఇకపై ఆడే మ్యాచుల్లో కనీసం ఐదు గెలవాల్సి ఉంటుంది. లేదంటే ఆశలు వదిలేసుకోవాల్సిందే. అందుకే ఈ మ్యాచ్‌ వీరిద్దరికీ కీలకం. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 మ్యాచులాడగా కేకేఆర్‌ 16, డీసీ 12 గెలిచింది.


ఢిల్లీ దూకుడు పెంచాలి
ఢిల్లీ క్యాపిటల్స్‌ కొన్ని రోజులు కొవిడ్‌తో బాధపడింది. ఇన్నాళ్లూ ఐసోలేషన్‌కు వెళ్లిన టిమ్‌ సీఫెర్ట్‌, మిచెల్‌ మార్ష్‌ తిరిగి జట్టులో చేరారు. డేవిడ్‌ వార్నర్‌ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. పృథ్వీ షా అతడికి చక్కగా సహకారం అందిస్తున్నాడు. మిడిలార్డర్‌ పరిస్థితి బాగాలేదు. పంత్‌ ఫామ్‌లో లేడు. రోమన్‌ పావెల్‌ మూమెంటమ్‌ అందుకోవడం శుభసూచకం. అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ మళ్లీ వికెట్ల బాట పట్టాలి. శార్దూల్‌ ఠాకూర్‌ తన స్థాయికి తగ్గట్టు బౌలింగ్‌ చేయాలి. ముస్తాఫిజుర్‌, ఖలీల్‌ అహ్మద్‌ ఫర్వాలేదు.


కోల్‌కతా పరిస్థితీ ఇంతే
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పరిస్థితీ అలాగే ఉంది. ఓపెనింగ్‌ కాంబినేషన్‌ మార్చేశారు. ఆరోన్‌ ఫించ్‌ ఓ హాఫ్‌ సెంచరీతో ఆశలు రేపాడు. కానీ గాయపడ్డాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ను మిడిలార్డర్‌కు పంపించారు. అతడింకా ఫామ్‌ అందుకోలేదు. శ్రేయస్‌ అయ్యర్‌, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్‌ జోరు పెంచాలి. వరుణ్‌, ఉమేశ్‌, టిమ్‌ సౌథీ బౌలింగ్‌ ఓకే. మొదట్లో ఉన్నటువంటి ఊపు, ఉత్సాహం ఇప్పుడా జట్టులో కనిపించడం లేదు.


ఢిల్లీ క్యాపిటల్స్‌ తుదిజట్టు
పృథ్వీ షా, డేవిడ్‌ వార్నర్‌, మిషెల్ మార్ష్, రిషభ్‌ పంత్‌(కెప్టెన్, వికెట్ కీపర్), లలిత్‌ యాదవ్‌, రొవ్‌మన్ పావెల్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, చేతన్ సకారియా


కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తుదిజట్టు
ఆరోన్ ఫించ్, సునిల్‌ నరైన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, రింకూ సింగ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, ఆండ్రీ రసెల్‌, టిమ్‌ సౌథీ, బాబా ఇంద్రజిత్ (వికెట్ కీపర్), ఉమేశ్‌ యాదవ్‌, హర్షిత్ రాణా