టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వానల గురించి పెట్టిన ట్విట్టర్ పోస్టు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. భారీ వర్షాలతో తన ఇల్లు మునిగిపోవడంతో ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. వరద కారణంగా తన ఇల్లు మునిగిపోయిన ఫోటోలను షేర్ చేశారు. ఈ మేరకు తానో బోట్ కొనాలి అనుకుంటున్నట్లు చెప్పారు. ఏ బోట్ అయితే బాగుంటుందో సలహా ఇవ్వాలని కోరారు. ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఆయన ఆ పోస్టును డిలీట్ చేశారు. ఆ తర్వాత కొంత కాలం పాటు ట్విట్టర్ లో ఎలాంటి పోస్టులు పెట్టకుండా సైలెంట్ అయ్యారు.


ట్విట్టర్ వివాదంపై స్పందించిన బ్రహ్మాజీ


తాజాగా ట్విట్టర్ వివాదం మీద బ్రహ్మాజీ స్పందించారు. ఆర్జీవీ డెన్  ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. ట్విట‌ర్ అకౌంట్ లో కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఎందుకు ఉండాల్సి వచ్చిందో వివరించారు. “భారీ వర్షం వచ్చిన రోజు తాను, తన భార్య బయట నుంచి ఇంటికి వెళ్లేందుకు వచ్చాము. మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న రోడ్డు కాస్త లోతుగా ఉంటుంది. అక్కడ భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వెనక్కి వెళ్లి మరో రోడ్డు ద్వారా మా ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నించాం. మా ఇంటి సమీపంలో ఉన్న కల్వర్టు మీది నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇంటికి వెళ్లే దారి కనిపించలేదు. దగ్గర్లోని తెలిసిన వారి అపార్ట్ మెంట్ లో మా కారును పార్క్ చేశాం. వంతెన మీదుగా ఇంటికి వెళ్లాలి అనుకున్నాం. నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో స్థానికులు మేం వెళ్లేందుకు సాయం చేశారు. వారి సాయంతో మేం నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాం. ఇంటి పరిసరాలు కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి. మా కారు కూడా నీటిలో మునిగిపోయింది. అపార్ట్ మెంట్ లోని చాలా మంది కార్లు కూడా వరద నీటిలోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలోనే నేను ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టాను” అని చెప్పారు.


సమస్యను సటైరికల్ గా చెప్పాను!


“సమస్యను సమస్య మాదిరిగా కాకుండా సటైరికల్ గా పెట్టడం నాకు అలవాటు. అలాగే నేను ఓ బోటు కొనాలి అనుకుంటున్నాను. సూచనలు ఇవ్వండి అని పోస్టు పెట్టాను. హైదరాబాద్ రెయిన్ అని ట్యాగ్ చేశాను. ఎక్కవ వరదలు వస్తే అక్కడి పేరు రాయడం కామన్. ముంబై వరదలు అయితే, ముంబై వరదలు అని రాస్తారు. కేరళలో కేరళ ఫ్లడ్స్ అని పెడతారు. హైదరాబాద్ రెయిన్స్ అని పెట్టడం చాలా మందికి నచ్చలేదు. ఆంధ్రోడా, అంటూ చిల్లర కామెంట్స్ చేశారు. నేను వివరణ ఇచ్చినా, అలాగే మాట్లాడారు. అందుకే కొంత కాలం పాటు ట్విట్టర్ లో సైలెంట్ అయ్యాను” అని బ్రహ్మాజీ వివరించారు.  


Read Also: ‘OMG 2’లో స్వలింగ సంపర్కం సీన్స్‌ ఉన్నాయా? మూవీ టీమ్ సెన్సార్ బోర్డ్‌కు ఏం చెప్పింది? గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial