ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు కోర్టు గడప తొక్కింది. తన గురించి తన ఆరోగ్యం గురించి అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేస్తున్న ఓ పత్రికపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. తాను మైనర్ ను కాబట్టి తన గురించి ఎలాంటి వార్తలు  ప్రచురించకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఈ కేసుపై ఇవాళ(ఏప్రిల్ 20న) న్యాయస్థానం విచారణ జరపనుంది.


గత కొద్ది కాలంగా నెగెటివ్ వార్తలు  


ఢిల్లీకి చెందిన చెందిన యూట్యూబ్ ఛానెళ్లు, టాబ్లాయిడ్స్ గత కొద్ది రోజులుగా ఆరాధ్య గురించి వరుస కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే, వాటిలో వాస్తవాల కంటే ఊహాగానాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమ్మాయి ఆరోగ్యంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలు కథనాలు ప్రచురించారు. వాటిపై బిగ్ బీ ఫ్యామిలీ సీరియస్ అయ్యింది. తప్పుడు వార్తలు జనాల్లోకి తీసుకెళ్తున్న సంస్థలపై  చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. అందుకే, చిన్నారి ఆరాధ్యతో ఢిల్లీ కోర్టులో కేసు వేయించింది. తప్పుడు వార్తలకు అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతోనే ఈ కేసు వేసినట్లు బిగ్ బీ ఫ్యామిలీ న్యాయవాదులు వెల్లడించారు.


కూతురిపై అసత్య వార్తలు, అభిషేక్ ఆగ్రహం  
వాస్తవానికి ఆరాధ్య గురించి మీడియా ఎప్పుడూ ఫోకస్ చేస్తూనే ఉంటుంది. అయితే, కొన్ని పత్రికలు, యూట్యూబ్ చానెళ్లు కావాలని కాంట్రవర్సీ వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికీ చాలా సార్లు ఆరాధ్య గురించి నెగెటివ్ వార్తలు ప్రసారం అయ్యాయి. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా అసత్య వార్తలు వండి వడ్డించాయి. ఈ వార్తలు రాస్తున్న సదరు సంస్థలపై ఆరాధ్య తండ్రి అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అకారణంగా ట్రోలింగ్ చేయడం అనేది సరైన పద్దతి కాదు. అలాంటి ట్రోలింగ్ ను ఎవరూ సమర్థించకూడదు. అయితే, సినీ తారల గురించి చాలా వరకు గాసిప్స్ వస్తుంటాయి. వాటిని ఆయా తారలు చూసిన నవ్వుకుంటారు. కానీ, తన కూతురు గురించి ట్రోల్ చేయడం, నెగెటివ్ వార్తలు రాయడం ఎందుకో అస్సలు అర్థం కావడం లేదు. ఆమె గురించి నెగెటివ్ వార్తలు రాయాల్సిన అవసరం ఏంటి? ఏదైనా డౌట్ ఉంటే నేరుగా నన్ను అడవగవచ్చు కదా?” అంటూ అభిషేక్ మండిపడ్డారు.


బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్  ఏప్రిల్ 20, 2007లో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని అమితాబ్ నివాసం ‘ప్రతీక్ష’లో ఈ వివాహ వేడుక జరిగింది. కొద్ది మంది అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి నిర్వహించారు. వారికి పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత, నవంబర్ 16, 2011 న అమ్మాయి జన్మించింది. ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టారు. 






Read Also: సౌత్ ఇండస్ట్రీలో సంతృప్తి దొరకలే, మరోసారి నోరు పారేసుకున్న తాప్సి