బతికున్నప్పుడు పదిమందితో వీడిది ఏం బతుకురా అనిపించుకోవటం కాదు.. మనం పోయిన తర్వాత నలుగురితోనైనా ఏం బతికాడు రా అనిపించుకుంటే ఈ జీవితానికి ఓ అర్థం.. పరమార్థం ఉన్నట్లే. దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లైఫ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఆయన ఈ లోకం విడిచి ఏడాది గడిచినా నేటికీ ప్రజలు ఏదో రకంగా తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన్ను గుండెల్లో పెట్టుకున్న కన్నడ ప్రజలైతే మరే హీరోకు దక్కని స్థాయిలో ఆయన మనతో గడిపిన క్షణాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన కర్ణాటక రత్న పునీత్ సేవలకు అందించిన గౌరవమైతే.. ఇప్పుడు ఆ ఖ్యాతి మరింత పెరగనుంది. కారణం పునీత్ రాజ్ కుమార్ పేరు ఆకాశాన్ని తాకనుంది.
కర్నాటక సర్కారు.. అరుదైన గౌరవం
కర్ణాటక ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టు చేపట్టింది. విద్యార్థులతో అంతరిక్ష ఉపగ్రహాలు తయారు చేయిస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో కర్ణాటక ప్రభుత్వం ఈ సైంటిఫిక్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహం తయారీ కోసం పనిచేస్తున్నది కూడా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులే. కర్ణాటక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ శాటిలైట్ ప్రాజెక్ట్ _KGS3Sat అనే ఈ ప్రాజెక్ట్ కింద తయారవుతున్న ఉపగ్రహానికి 'శాటిలైట్ పునీత్' అని పేరు పెట్టింది.
విద్యార్థులు రూపొందించిన 'శాటిలైట్ పునీత్'
పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత KGS3Sat కు అధికారికంగా పేరు మార్చిన కర్ణాటక ప్రభుత్వం...విద్యార్థుల ల్యాబ్ సౌకర్యాలు ఫెసిలిటీ కోసం బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రభుత్వ పాఠశాలను గ్రౌండ్ స్టేషన్ గా ఎంచుకుంది. ఈ స్టేషన్ కు కూడా పునీత్ శాటిలైట్ వర్క్ స్టేషన్ అనే పేరు పెట్టింది. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై దీన్ని ప్రారంభించారు. శాటిలైట్ తయారీ కోసం కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుంచి విద్యార్థుల మోడళ్లు అందాయి. వాటిలో ది బెస్ట్ 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసిన శాస్త్రవేత్తలు...వారికి శిక్షణనిచ్చి 'శాటిలైట్ పునీత్' తయారీకి పరిశోధనలను ప్రారంభించారు.
రూ. కోటి 90 లక్షలతో 'శాటిలైట్ పునీత్' తయారీ
కోటి 90 లక్షల రూపాయల ఖర్చుతో రూపొందించే కిలోన్నర బరువుండే 'శాటిలైట్ పునీత్' పూర్తి కాగానే దాన్ని ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ కు తరలిస్తారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ద్వారా ఈ శాటిలైట్ పునీత్ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా 75 శాటిలైట్లను విద్యార్థులతో తయారు చేయించాలన్న ప్రధాని సూచనలను పాటించిన కర్ణాటక ప్రభుత్వం ఇక్కడి గవర్నమెంట్ విద్యార్థులతో తయారు చేస్తున్న శాటిలైట్ పునీత్... దేశంలో ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు తయారు చేస్తున్న తొలి శాటిలైట్. నవంబర్ 5 నుంచి డిసెంబర్ 31 మధ్యలో శాటిలైట్ పునీత్ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సాధారణంగా 50కిలోల బరువు, 50-60 కోట్ల ఖర్చు పెడితే కానీ పూర్తికానీ ఈ శాటిలైట్ ను స్వదేశీ టెక్నాలజీ వినియోగించటం ద్వారా కేవలం కోటి 90 లక్షల రూపాయల ఖర్చులో కిలోన్నర బరువులోనే పూర్తి చేయనున్నారు. విద్యార్థులకు తర్ఫీదు నిచ్చేందుకు, గైడ్ చేసేందుకు కర్ణాటక వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు ముందుుక వస్తున్నారు. మొత్తంగా పునీత్ రాజ్ కుమార్ ఖ్యాతి ఈ ఉపగ్రహ ప్రయోగం ద్వారా అంతరిక్షానికి చేరుకోవటం ఆయన అందించిన సేవలకు సరైన గుర్తింపు అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తున్నారు.
Read Also: బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’ను చూసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రిషబ్ శెట్టికి అభినందనలు