Konaseema News: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల చేసే నిర్వాకాల గురించి తరచూ వెలుగులోకి వస్తూ ఉంటాయి. తాజాగా మరో మహిళా వాలంటీర్ చేసిన మోసం ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు పెద్ద సమస్య తెచ్చి పెట్టింది. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మహిళా సంఘాలకు 23 లక్షలు టోకరా వేశారు వాలంటీర్ అముజూరు దుర్గాదేవి. కే గంగవరం మండలం బ్రహ్మపురి, పిల్లంక గ్రామాలకు చెందిన మహిళా సంఘాలు కట్టిన డబ్బులను ఆమె సొంతానికి వాడుకున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చే వరకూ డ్వాక్రా సంఘాలల మహిళలకు అసలు విషయం తెలియలేదు. తీరా నోటీసులు వచ్చిన తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి అడిగితే.. తన దగ్గర లేవని సమాధానం చెబుతున్నారు. దీంతో ఆ డ్వాక్రా మహిళలకు కాళ్లూ చేతులూ ఆడటం మానేశాయి.
వాలంటీర్‌ను కాబట్టి అందరూ తనకే డబ్బులు ఇవ్వాలని డ్వాక్రా సంఘాలకు దుర్గాదేవి హెచ్చరిక
వాలంటీర్‌గా పని చేస్తూండటంతో అహుజూరు దుర్గాదేవి అందరితో పరిచయం పెంచుకుంది. ఆమెతో గొడవ పడితే ప్రభుత్వ పథకాలు రావేమోనని దురుసుగా ప్రవర్తించినా సర్దుకుపోయేవారు. ఆమె వాలంటీర్ పనితో పాటు ఇటీవల ఓ బ్యాంక్ సెంటర్‌ను ప్రారంభించింది. తమ గ్రామంలో మహిళా సంఘాలన్నీ డబ్బులు బ్యాంకులో కట్టాల్సిన పని లేదని.. తమ బ్యాంకులో కడితే చాలని వారికి చెప్పింది. అడిగింది వాలంటీర్.. ఒక వేళ కట్టకపోతే.. పథకాలు..పెన్షన్లు ఎత్తేస్తుందన్న భయంతో వారంతా.. ఆమె దగ్గరే కట్టడం ప్రారంభించారు. డ్వాక్రా మహిళల దగ్గర ప్రతీ నెలా వాయిదాలను వసూలు చేస్తున్న దుర్గా దేవి వారికి కట్టినట్లుగా రసీదులు ఇవ్వడం లేదు. అయితే గట్టిగా అడగలేకపోయారు. వాలంటీగ గారూ రసీదు ఇస్తారా అని అడిగినప్పుడల్లా.. నన్నే రసీదు అడుగుతారా అన్నట్లుగా బెదిరింపుగా మాట్లాడేది.
డబ్బులు తీసుకుని బ్యాంక్‌లో జమ చేయకుండా వాడేసుకున్న దుర్గాదేవి
సరే .. ఆమెతో గొడవ ఎందుకు.. కట్టకుండా ఎక్కడికి పోతుంది.. గ్రామంలోనే ఉంటుంది కదా అని సైలెంట్ అయిపోయారు. కానీ.. హఠాత్తుగా బ్యాంకుల నుంచి వారికి నోటీసులు వచ్చాయి. మహిళా సంఘం పేరుతో రుణాలు తీసుకుని కట్టడం మానేశారు.. అర్జంట్‌గా మొత్తం చెల్లించాలని ఆ నోటీసుల సారాంశం. దీంతో లబోదిబోమన్న డ్వాక్రా మహిళలు.. వెంటనే.. వాలంటీర్ దుర్గాదేవి దగ్గరకువెళ్లారు. తాను మొత్తం వాడేసుకున్నానని.. తన దగ్గర పైసా కూడా లేవని ఆమె .. డ్వాక్రా మహిళలకు తేల్చేసారు. విషయం తెలుసుకున్న ఏపిఎం రఘురాం సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
న్యాయం చేయాలని స్టేషన్‌లో బాధిత మహిళల ఫిర్యాదు
మహిళలు అందరూ.. వెంటనే కే.గంగవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోయిన సొమ్ము తిరిగి రప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వాలంటీర్ దుర్గాదేవి వాడుకున్న మొత్తం రూ. 23 లక్షలు అని.. అంత మొత్తంలో ఇప్పుడు తాము బ్యాంకులకు కట్టలేమని బాధిత మహిళలు అంటున్నారు. ఆమె వాలంటీర్ అని.. అదే నమ్మకంతో ఉన్నామని.. కానీ ఇంత మోసం చేస్తుందని అనుకోలేదని అంటున్నారు.