చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న ‘కాంతార’


నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతార' సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.  కన్నడ లో విడుదల అయిన ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ బస్టర్ సాధించింది.  దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదల చేసింది చిత్ర యూనిట్. విడుదల అయిన అన్ని భాషల్లోనూ కాంతార సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.  'కాంతార'కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఓ రేంజిలో వసూళ్లు రాబడుతోంది. మొత్తంగా ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.


పతాక సన్నివేశాలకులు ప్రేక్షకులు ఫిదా


'KGF' లాంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ 'కాంతార' చిత్రాన్ని నిర్మించారు. మరోసారి ఆయన పాన్ ఇండియా స్థాయిలో విజయం అందుకున్నారు. 'కాంతార'లో హీరోగా నటించిన రిషబ్ శెట్టి, సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన నటనకు, దర్శకత్వానికి తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కర్నాటక కల్చర్ ను చక్కగా చూపించాడు రిషబ్. భూతకోలా సంప్రదాయం గురించి సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలను ఆయన తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 


‘కాంతర’ సినిమా చూసిన నిర్మల.. రిషబ్ శెట్టికి అభినందనలు


ఇక తాజాగా ‘కాంతార’ సినిమాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చూశారు. బెంగళూరులో ఈ సినిమాను తిలకించారు. అనంతరం ఆమె.. రిషబ్ శెట్టికి కాల్ చేశారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇలాంటి సినిమాలు మరెన్నో తెరకెక్కించాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి ప్రశంసల పట్ల రిషబ్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు.





‘కాంతార’ సీక్వెల్ పై రిషబ్ సంకేతాలు


అటు 'కాంతార' సాధించిన విజయంతో దీనికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేసే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్వయంగా రిషబ్ శెట్టి చెప్పారు. అయితే... మరో సినిమా స్టార్ట్ చేయడానికి ముందు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని ఉందని, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉందని ఆయన పేర్కొన్నారు. తాజాగా తిరుపతికి వచ్చిన రిషబ్ శెట్టి సీక్వెల్ రాబోతుందని సంకేతాలు ఇచ్చారు.   


Read Also: ‘కాంతార’ సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతి