Klin Kaara Konidela: మెగా స్టార్ చిరంజీవి కుటుంబంలో మహాలక్ష్మీ రాకతో సంతోషాలు వెల్లువిరిసాయి. ఇటీవలే మెగా గ్రాండ్ డాటర్ బారసాల వేడుక అట్టహాసంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. లిటిల్ మెగా ప్రిన్సెస్ ను ఊయలలో వేయడమే కాకుండా పేరు కూడా పెట్టేశారు. దీంతో మెగా అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఓ వార్త గత రెండు రోజులు గా సర్క్యులర్ అవుతోంది. అదేంటంటే.. ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ రామ్ చరణ్ కుమార్తెకు కాస్ట్లీ గిఫ్ట్ ఒకటి ఇచ్చారని. దీనిపై నెట్టింట విపరీతంగా వార్తలు రావడంతో రామ్ చరణ్ అఫీషియల్ టీమ్ స్పందించింది. 


ఆ వార్తలో నిజం లేదు..


రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు అయ్యారని తెలిసిన దగ్గర నుంచీ వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మెగా అభిమానుల నుంచి విషెస్ హోరెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వ్యాపారవేత్త రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ వారి కుమార్తెకు రూ.1.20 కోట్లు విలువ చేసే బంగారు ఊయలను గిఫ్ట్ గా ఇచ్చారనే వార్త ఒకటి బయటకు వచ్చింది. గత రెండు రోజులుగా దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే దీని గురించి అటు మెగా ఫ్యామిలీ గానీ ఇటు అంబానీ ఫ్యామీలీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలపై రామ్ చరణ్ అఫీషియల్ టీమ్ స్పందించింది. ముఖేష్ అంబానీ నుంచి అలాంటి బహుమతి ఏమీ రాలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. దీంతో బంగారు ఊయల వార్తలకు చెక్ పడినట్లైంది. 


క్లీం కార కొణిదెల..


ఇటీవల మెగా వారసురాలు బారసాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. పాపను ఊయలలో వేయడమే కాకుండా పేరు కూడా పెట్టేశారు. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు ‘క్లీం కార’ అని నామకరణం చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది కూడా. వేడుక తర్వాత మెగా స్టార్ చిరంజీవి తన ముద్దుల మనవరాలికి పేరు పెట్టినట్టు ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు. ‘క్లీం కార’ అనే పేరును తన మనవరాలికి పెట్టామని చెప్పారు. అంతేకాదు ఆ పేరుకు అర్థం ఏంటో కూడా వివరించారాయన. ‘క్లీం కార’ నామం ప్రకృతి స్వరూపాన్ని, అమ్మవారి అత్యున్నత శక్తిని సూచిస్తుందన్నారు. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరు తీసుకున్నామ‌ని చెప్పారు. ల‌లితా స‌హ‌స్ర నామంలో 622 వ నామం ఓం క్లీంకార్యై నమః అని ఉంటుంది. ఈ నామానికి ప్రకృతికి ప్రతిబింబం అని అర్థం. అమ్మవారి శక్తి రూపానికి ఇది మ‌రో పేరు. అయితే ఈ పేరు పై సోషల్ మీడియాలో చర్చలు కూడా నడిచాయి. ఈ పేరు వినగానే అందరూ మొదట్లో ఆశ్ఛర్యం వ్యక్తం చేసినా తర్వాత ఆ పేరుకు ఉన్న అర్థం ఏంటో తెలుసుకున్నాక చాలా మంచి పేరు పెట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. 


Also Read: దిల్ రాజు కొడుకు బర్త్ డే వేడుకలో తారల సందడి - ఫొటోలు వైరల్