గంగిగోవు పాలు గరిటెడైన చాలు.. కడవడైనేమి ఖరము పాలు అంటారు పెద్దలు.. అలాగే సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు? ఎంత టెక్నాలజీ వాడారు? ఎంత గొప్ప యాక్టర్లు నటించారు? అనేది ముఖ్యం కాదు. కంటెంట్ జనాలకు కనెక్ట అయ్యిందా? లేదా? అన్నదే ముఖ్యం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్న సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. సినిమాలో విషయం లేనప్పుడు ఎంత ప్రచారం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. తాజాగా వచ్చిన ‘లైగర్’ సినిమా విషయంలోనూ ఇదే రుజువైంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాం అంటే.. జస్ట్ 57 నిమిషాల సినిమా.. అంతర్జాతీయ వేదికల మీద 17 అవార్డులను గెల్చుకుని.. అందరి చేత వారెవ్వా అనిపించుకుంటోంది. ఆ సినిమా మరేదో కాదు.. ‘21 గ్రామ్స్’.
కొత్త దర్శకుడు యాన్ శశి ‘21 గ్రామ్స్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన శశి.. సొంతంగా ఈ సినిమాను తీశారు. ఈ చిత్రంలో హీరోగా మోగణేష్ నటించారు. మరో కీలక పాత్రలో రాము నటించారు. సుందర్ రాజన్, అన్బు డెన్నిస్‌లు ఛాయా గ్రహణం, విజయ్ సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు సంబంధించిన పలు వివరాలను తాజాగా దర్శకుడు శశి వెల్లడించారు.
“ప్రాణం విలువ వెలకట్టలేనిది. మనిషి ప్రాణాన్ని తీసే హక్కు, అధికారం ఎవరికి లేదు” ఇదే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుందని చెప్పారు. పూర్తి నిడివితో చిత్రాన్ని చేయాలన్నదే తన కల అన్నారు. అలా ఒక స్టోరీని తయారు చేసుకుని ప్రముఖ నిర్మాణ సంస్థలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు చెప్పారు. కానీ, అదే సమయంలో కరోనా కల్లోలం మూలంగా ఆ సినిమా ప్రారంభం ఆలస్యం అయ్యిందన్నారు. ఈ నేపథ్యంలో 15 నిమిషాల నిడివితో ఒక పైలట్ చిత్రాన్ని చేయాలని భావించినట్లు చెప్పారు. కానీ, కథ డెవలప్ చేయడంతో 57 నిమిషాలకు చేరుకుందని చెప్పారు. దానికి ‘21 గ్రామ్స్’గా పేరు పెట్టినట్లు వెల్లడించారు.
ఈ సినిమాని తొలిసారిగా కోల్ కతాలో జరిగి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించినట్లు శశి తెలిపారు. ఈ వేడుకల్లో తమ చిత్రానికి పలు అవార్డులను దక్కించుకున్నట్లు చెప్పారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు అవార్డులను అందుకున్నట్లు తెలిపారు. అటు ఠాగూర్ అంతర్జాతీయ దినోత్సవాలు, సింగపూర్ చిత్రోత్సవాలు, టోక్యో, ఇటలీ, రోమ్, అమెరికన్ గోల్డెన్ పిక్చర్స్ చిత్రోత్సవాల్లో ఇప్పటి వరకు 17 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుందని తెలిపారు. ఒక ఫుల్ లెన్త్ సినిమాను చూసిన సంతృప్తిని ఈ మూవీ కలిగిస్తుందని తెలిపారు. ఈ సినిమాను చూసిన పలువురు ప్రశంసలు కురిపించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తానని చెప్పారు. వారు కూడా తమ సినిమాను ఆదరిస్తారనే భావిస్తున్నట్లు దర్శకుడు శశి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు
Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ