PA Deepak: 


రహమాన్ సారథ్యంలో..


ఓ పాట హిట్ అయితే..ఆ క్రెడిట్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్‌కి, రాసిన లిరిసిస్ట్‌కి వెళ్లిపోతుంది. కానీ...ఓ పాటని ఎంత గొప్పగా కంపోజ్ చేసినా, ఎంత బాగా రాసినా అది వినసొంపుగా లేకపోతే ఎవరూ పట్టించుకోరు. విన్నంత సేపు ఎక్కడా చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకూడదు. ప్రతి Instrument చాలా క్లియర్‌గా వినిపించాలి. సింపుల్‌గా చెప్పాలంటే...పాటలో ఉన్న ఎమోషన్‌ను క్యారీ చేయాలి. పాటలో మాత్రమే కాదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లోనూ ఇదే థియరీ అప్లికబుల్ అవుతుంది. ఏఆర్ రహమాన్‌కు (AR Rahman)అంత గొప్ప పేరొచ్చింది ఈ క్వాలిటీ వల్లే. ఆయన కంపోజ్ చేసిన పాటల్లో సౌండింగ్ అద్భుతంగా ఉంటుంది. 90ల్లో సినీ పరిశ్రమకు కొత్త సౌండింగ్‌ను పరిచయం చేశారాయన. అలాంటి రహమాన్‌ సారథ్యంలో పని చేశారు..విశాఖకు చెందిన పీఏ దీపక్ (PA Deepak). సంగీత ప్రపంచంలో అత్యుత్తమ అవార్డుగా భావించే Grammy Awardను రెండుసార్లు సాధించారు. భారత సంతతికి చెందిన రిక్కీ కెజ్‌ (Ricky Kej) కంపోజ్ చేసిన "Divine tides" ఆల్బమ్‌కు ఇటీవలే Grammy Award అందుకున్నారు. 




నాన్న మాటలే స్ఫూర్తి మంత్రమై..


పీఏ దీపక్‌కు సంగీతం అంటే పిచ్చి. మ్యూజిక్ లో తను చూపిస్తున్న ఇంట్రెస్ట్  ను గమనించిన తల్లితండ్రులు దీపక్ ను ప్రోత్సహించారు. 5 వ తరగతి నుంచే గిటార్ వాయించడం నేర్చుకున్న దీపక్ వైజాగ్ లోని సెయింట్ లూక్ రికార్డింగ్ స్టూడియోలో మ్యుజీషియన్ గా తన పయనం ప్రారంభించాడు. అక్కడ ప్రీతమ్ లూక్ ,ఆశీర్వాద్ లూక్ లతో కలిసి తన నైపుణ్యానికి మరింత పదును పెట్టారు. దీపక్ తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా పని చేసే వారు. "ఏ పని చేసినా 100% శ్రమించు" అని ఆయన చెప్పిన మాటల్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు దీపక్. 


సంగీతంపై ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది..? 


పీఏ దీపక్ తండ్రి ప్రొఫెసర్ మాత్రమే కాదు. అగ్రికల్చరల్ ఫోక్‌ సాంగ్స్‌లో ఆయన పీహెచ్‌డీ కూడా చేశారు. ఆ సమయంలో ప్రపంచ దేశాల్లోని రకరకాల జానపద పాటల్ని వినేవారు. ఆ పాటలు దీపక్‌కు ఎంతో నచ్చేవి. క్రమంగా మ్యూజిక్‌పై ఆసక్తి పెరిగింది. దీపక్ ఇంటికి ఎదురుగానే ఓ ఆలయం ఉండేది. రోజూ ఉదయం అక్కడ భక్తి పాటలు పెట్టేవారు. ఆ పాటలు వినేందుకు గుడికి వెళ్లేవాడు దీపక్. సినిమా పాటలు వినడమూ మొదలు పెట్టాడు. అప్పటికి ఇళయరాజా పాటలు దేశమంతా మారుమోగుతున్నాయి. అందరూ ఆయన పాటలు విని ఆస్వాదిస్తుంటే...దీపక్ మాత్రం ఆ పాటల్లో వినిపించే సౌండింగ్‌ను ఇష్టపడేవాడు. ఇళయరాజా పాటల్లో గిటార్‌ మ్యూజిక్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. అదే దీపక్‌ను ఆకట్టుకుంది. ఎలాగైనా గిటార్ నేర్చుకోవాలని అనుకున్నాడు. ఆ ఆసక్తితోనే ఏడేళ్ల వయసులోనే గిటార్ నేర్చుకోవటం మొదలు పెట్టాడు. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోయుంటే మ్యూజిక్‌వైపు అడుగులు వేసే వాడినే కాదు అని అంటారు పీఏ దీపక్. 


గిటారిస్ట్ నుంచి రికార్డింగ్ ఇంజనీర్ వరకూ:


గిటారిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు పీఏ దీపక్. ఆ తరవాత రికార్డింగ్ ఇంజనీర్ (Recording Engineer) గా సెటిల్ అయ్యారు. మ్యూజిక్ మిక్సింగ్ ,సౌండ్ రికార్డింగ్ లో నైపుణ్యం సంపాదించారు. ప్రస్తుతం పేరొందిన మ్యూజిషియన్ ల లైవ్ రికార్డింగ్ కి మిక్సర్ గా పని చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్ హీరోగా  2013 లో వచ్చిన హిందీ సినిమా "బాస్" (Boss) సినిమాలో సంగీత పరంగా సౌండ్ రికార్డింగ్ లో (Sound Recording) దీపక్ చేసిన ప్రయోగాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఏఆర్ రహమాన్,కీరవాణి సహా లెజెండ్రీ మ్యుజీషియన్స్ తో కలిసి పని చేసే అవకాశం రావటం..తనకు దక్కిన అదృష్టం అంటారు పీఏ దీపక్ .  




రావణ్ సినిమాలో గిటారిస్ట్‌గా:
 
అనుకోకుండా ఏఆర్ రహమాన్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ఆ తరవాత దీపక్ దశ తిరిగింది. అభిషేక్ బచ్చన్ ,ఐశ్వర్య రాయ్ ,విక్రమ్ నటించిన మణిరత్నం సినిమా రావణ్ లో (Raavan) గిటార్ వాయించారు దీపక్. అంతే కాదు. ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించిన అనేక సినిమాల్లో మిక్సింగ్ ఇంజనీర్‌గా పని చేశారు. ముఖ్యంగా రహమాన్‌కి ఆస్కార్ తెచ్చిపెట్టిన స్లమ్ డాగ్ మిలియనీర్ (Slumdog Millionaire) చిత్రానికి పని చేశారు దీపక్. 




ఒకటికి రెండు గ్రామీ అవార్డులు :


సంగీత రంగంలో ఉండే ఏ వ్యక్తి అయినా Grammy అవార్డు కోసం కలలు కంటాడు. అలాంటిది దీపక్‌కి మాత్రం ఒకటి కాదు రెండు గ్రామీ అవార్డులు లభించాయి. 2010 లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు Best Soundtrack Engineerగా మొదటిసారి గ్రామీ అవార్డు వస్తే 2015 లో బెస్ట్ సరౌండింగ్ మిక్స్ ఇంజనీర్ (Best Surrounding Mix Engineer) గా Winds of Samsara అనే న్యూ ఏజ్ ఆల్బమ్ కు గానూ మరోసారి Grammy అవార్డు వరించింది. ఒక మ్యుజీషియన్ గా ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది అంటారు పీఏ దీపక్. 2011 లో ఎందిరన్ (రోబో )   సినిమాకు బెస్ట్  సౌండ్ మిక్సింగ్ కేటగిరీ కింద వచ్చిన విజయ్ మ్యూజిక్ అవార్డు కూడా ఎంతో ప్రత్యేకమైంది. 




మరికొన్ని విశేషాలు..



  • 1994-99 మధ్య కాలంలో గిటార్ నేర్చుకున్నారు పీఏ దీపక్. 

  • 1999-2000లో ఆడియో ఇంజనీర్ ఇంటర్న్‌గా పని చేశారు. 

  • 2004-06 మధ్య కాలంలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా, మిక్సింగ్ ఇంజనీర్‌గా పని చేశారు. 

  • 2009లో హాలీవుడ్ మూవీ "Couples Retreat" మూవీకి కూడా పని చేశారు. 

  • 2010లో హాలీవుడ్ మూవీ 127 Hoursకి రహమాన్ సౌండ్ ట్రాక్ అందించారు. ఈ మూవీ రెండు విభాగాల్లో ఆస్కార్‌కు (Oscar) నామినేట్ అయింది. ఈ సౌండ్ ట్రాక్‌కి మిక్సింగ్ ఇంజనీర్‌గా పని చేశారు దీపక్. 

  • 2012-14 లో డాల్బీ అట్మాస్‌లో (Dolby Atmos) మిక్సింగ్ ఇంజనీర్‌గా పని చేశారు. 

  • 2015లో శాంతి సంసార (Shanti Samsara) అనే వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్‌లోనూ పని చేశారు.

  • 2019 నుంచి డాల్బీ అట్మాస్‌ (Dolby Atmos)లో మిక్సింగ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు దీపక్. అంతే కాదు. పలు నేషనల్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లకు మాస్టర్ ఇంజనీర్‌గానూ వర్క్ చేస్తున్నారు. 




 


Also Read: Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం